మేమే కారణమనడం
హత్యాకేసులు పెట్టాలనడం
మీడియా అతిగా ప్రచురించడం
పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి
మద్రాసు హైకోర్టుకు ఇసి కౌంటరు
వ్యాఖ్యలవెల్లడిపై నిషేధానికి డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ రెండో దశ ఉధృతికి ఎన్నికల సంఘం నిర్ణయాలే కారణం అనే మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. తమ స్వతంత్ర సంస్థ పట్ల న్యాయవ్యవస్థ చేసిన ఘాటైన వ్యాఖ్యలతో పత్రికల్లో వచ్చిన వార్తలపై ఇసి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దేశంలో కరోనా నేరం అంతా ఎన్నికల సంఘానిదే అన్నట్లుగా మీడియాలో వార్తలు వెలువడ్డాయని, దీనితో తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతిందని వాపోయింది. కేసు విచారణల దశలో కోర్టు చేసే మౌలిక వ్యాఖ్యలను పూర్తిగా నిర్థారించుకోకుండా ప్రచురణకు దిగరాదు. ఈ మేరకు మీడియా సంస్థలను నియంత్రించాల్సి ఉందని కోరుతూ ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు, ఈ దశలో భారీ బహిరంగ సభలు, జనసమీకరణలో పార్టీల పోటాపోటీ వంటి పరిణామాలకు ఎన్నికల సంఘం వెలువరించిన ఎన్నికల ప్రకటన కారణం అయిందని ఇటీవలే మద్రాసు హైకోర్టు ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ఇది దేశవ్యాప్త సంచలనానికి దారితీసింది. రాజ్యాంగబద్ధంగా పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించే బాధ్యతాయుత, స్వతంత్ర సంస్థగా ఎన్నికల సంఘానికి పేరుంది. ఇప్పటివరకూ ఇటువంటి ప్రతిష్టను సంతరించుకుని ఉన్న ఎన్నికల సంఘానికి మీడియా కథనాలతో ఇబ్బంది ఏర్పడిందని ఇసి తెలిపింది.
అయితే తమపై మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించలేదు. ఇవి పత్రికలలో వెలువడటం వల్ల పరువు పోయిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం వైఖరితో ఎన్నికల ప్రక్రియ జరిగి, కరోనాతో జనం చావడంతో ఎన్నికల సంఘం అధికారులపై హత్యానేరం కేసులు ఎందుకు పెట్టకూడదు? అని మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యల తరువాత పశ్చిమ బెంగాల్‌లో డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌పై కేసు కూడా నమోదు అయిన విషయాన్ని ఇసి తెలియచేసుకుంది. ఎన్నికల ఘట్టం ముగిసిపోయిన తరువాతి దశలో మద్రాసు హైకోర్టు తమపై ఘాటు వ్యాఖ్యలకు దిగడం ఎంతవరకు సముచితం? అని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. సమయం కాని సమయంలో అసందర్భ వ్యాఖ్యలుగా మారుతున్నాయని ఇటువంటివి ఇకపై ప్రచురణలకు వీల్లేకుండా చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసుకుంది.
EC Counter to Madras High Court over murder charge