Sunday, January 19, 2025

ముందు వెనుకలు!

- Advertisement -
- Advertisement -

EC Delay Gujarat election schedule only to benefit BJP

దేశంలో ఎన్నికలు బలవంతుల ప్రాబల్య క్రీడాస్థలంగా మారిపోయి అనేక దశాబ్దాలైంది. స్వాతంత్య్రం సాధించుకొన్నప్పుడు చెప్పుకొన్న ఘన సంకల్పాలన్నీ దానితోనే గాలికి పేలపిండిలా నామరూపాల్లేకుండా పోయాయి. కొన్ని చోట్ల పైచేయి కోసం పాలక పక్షాలు నియమాలను ఉల్లంఘించడం తీవ్రమైపోయింది. ఇందు లో కేంద్రంలోని అధికార పక్షం బిజెపి తనకు సాటి లేరని రుజువు చేసుకుంటున్నది. కేవలం 40 రోజుల వ్యవధిలో ముగింపుకి రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల ఎన్నికల షెడ్యూళ్లను ఒకే సారి ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొన్న నిర్ణయం నిష్పాక్షికత మీద సహజంగానే అనుమానాలు తలెత్తాయి. గతంలో 60 రోజుల వ్యవధిలో ముగిసిన యుపి, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబీల ఎన్నికలను ఒకేసారి ప్రకటించారు. అంతకంటే తక్కువ వ్యవధి గల హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల షెడ్యూళ్లను విడదీయడం కేంద్ర పాలక పక్షం ప్రయోజనాల కోసమేననే అభిప్రాయానికి ఆస్కారం కలిగింది. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ప్రకటించింది.

గుజరాత్‌ను ఎందుకు వదిలిపెట్టారని అడగగా 2017లో కూడా ఇలాగే జరిగిందని సిఇసి రాజీవ్ కుమార్ తెలివిగా సమాధానం చెప్పారు. అప్పుడు హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 12న, గుజరాత్ షెడ్యూల్‌ను 25న ఇసి ప్రకటించింది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మాత్రం డిసెంబర్ 18నే చోటు చేసుకొన్నది. ఈసారి కూడా రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఒకే రోజున చేపడతారా అని అడగ్గా గుజరాత్ షెడ్యూలు ప్రకటించినప్పుడు చెబుతామని సిఇసి వెల్లడించారు. ఏవో కారణాల వల్ల రెండు ‘సమీప’ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూళ్లను ఒకసారి విడివిడిగా ప్రకటించినంత మాత్రాన దానినే దుస్సంప్రదాయంగా పాటించవలసిన పని లేదు. దగ్గరిలో గల రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించే సత్సంప్రదాయాన్ని పునరుద్ధరించవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం హిమాచల్‌ప్రదేశ్ పోలింగ్ ఈసారి నవంబర్ 12న జరగనున్నది. ఓట్ల లెక్కింపు మాత్రం డిసెంబర్ 8న జరుగుతుంది. వాస్తవానికి ఈ రెండు తేదీల మధ్య అంత దూరం వుండనవసరం లేదు. గుజరాత్‌తో కలిసి ఒకేసారి లెక్కింపు చేపట్టడం కోసం ఎన్నికల సంఘం ఈ దూరాన్ని ఆశ్రయించినట్టు స్పష్టపడుతున్నది.

బిజెపికి మేలు చేయడం కోసమే గుజరాత్ షెడ్యూల్‌ను ఆలస్యంగా ప్రకటించదలిచారని భావించడానికి అవకాశం కలుగుతున్నది. కేంద్ర పాలక పక్ష ప్రయోజనాల కోసం మంచి సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేస్తుంది. గుజరాత్ ఓటర్లను ఆకట్టుకోడానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల కిమ్మత్తు శంకుస్థాపనలను ప్రకటించి కొన్ని ప్రారంభోత్సవాలు కూడా జరిపించిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ తమకు గూడుకట్టుకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని పథకాల ప్రకటనకు అనువుగా ఎన్నికల షెడ్యూల్‌ను ఆలస్యం చేయించారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శను త్రోసిపుచ్చలేము.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కొత్త పథకాలు, వరాలు గుప్పించడానికి ఆస్కారం వుండదు. గుజరాత్‌లో గత జూన్‌లో రూ. 3,050 కోట్ల కిమ్మత్తు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మొన్న 10వ తేదీన మరి రూ. 8000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపారు.

సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మళ్లీ మరొక్కసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల మోడీ, అమిత్ షాలలో చోటు చేసుకొన్నది. ఓడిపోతే అది తమ బలహీనత అవుతుందని వారు భయపడుతున్నారు. అందుకోసం ఎప్పటిలాగే, ఎందుకైనా తెగించేలా వున్నారు. గుజరాత్‌ను బిజెపి 25 ఏళ్లుగా ఏకబిగిన పాలిస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి కూడా బిజెపికి ఏమంత అనుకూలంగా లేనట్టు తెలుస్తున్నది. 2021 అక్టోబర్‌లో అక్కడ ఉప ఎన్నికలు జరిగిన ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ అది ఓటమి పాలైంది, అన్ని చోట్లా కాంగ్రెస్ గెలిచింది. బిజెపి అక్కడ అధికారంలో వుండి కూడా అంతటి ఘోర పరాజయాన్ని చవిచూడడం ఆశ్చర్యం కలిగించింది.

2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జరిగే ప్రతి ఎన్నిక కమలనాథులకు అత్యంత ప్రతిష్ఠాకరం అవుతుంది. కేంద్రంలోని వారి పాలన ఇప్పటికే దేశ ప్రజల తిరస్కారానికి గురవుతున్నది. జారుడు బండ మీద ఉన్న ఆ పార్టీ నిలదొక్కుకోడానికి విశేషంగా కృషి చేస్తున్నది. అందుకు అన్ని నీతులను, నియమాలను బలి తీసుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 శాసన సభా స్థానాలున్నాయి. 55 లక్షల మంది ఓటర్లున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో బిజెపికి 45 స్థానాలు, కాంగ్రెస్‌కు 20 స్థానాలు వున్నాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు, సిపిఎంకి ఒక స్థానం, మరొకరికి ఒక స్థానం వున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News