Tuesday, April 22, 2025

ఇసి రాజీ పడిందన్నది సుస్పష్టం

- Advertisement -
- Advertisement -
  • కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
  • మహారాష్ట్ర ఎన్నికల వోట్ల లెక్కింపుపై తీవ్ర ఆరోపణలు
  • రెండు గంటల్లో 65 లక్షల వోట్లు పోల్ కావడం అసాధ్యమని వ్యాఖ్య
  • విదేశీ గడ్డపై రాహుల్ విమర్శలపై మండిపడిన బిజెపి
  • రాహుల్ ఒక ‘దేశద్రోహి’ అన్న బిజెపి

బోస్టన్/ న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్ (ఇసి) పూర్తిగా ‘రాజీ పడింది’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ యుఎస్‌లో ఒక కార్యక్రమంలో ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో హాజరైన వోటర్ల గణాంకాలను రాహుల్ ఉటంకిస్తూ ఎన్నికల కమిషన్‌పై విరుచుకుపడ్డారు. ఆయన ఆరోపణలకు బిజెపి తీవ్రంగా స్పందించింది. రాహుల్‌ను ఒక ‘దేశద్రోహి’గా బిజెపి అభివర్ణించింది. తాను గతంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తానని చెప్పిన రాహుల్ ‘అసలు వ్యవస్థలోనే ఏదో లోపం ఉంది’ అని ఆరోపించారు. అయితే, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి చర్యతో ఆయన విమర్శను బిజెపి ముడిపెట్టింది. రాహుల్ విదేశీ గడ్డపై దేశీయ వ్యవస్థలను ‘అవమానించడమే’ కాకుండా, అవినీతికి కూడా పాల్పడ్డారని పార్టీ ఆరోపించింది. రాహుల్, ఆయన తల్లి ‘నిధుల స్వాహా’కు ‘జైలుకు వెళతారు’ అని బిజెపి సూచించింది. యుఎస్ చేరుకున్న రాహుల్ గాంధీ ఆదివారం బోస్టన్‌లో ఒక కార్యక్రమంలో ఆ వ్యాఖ్యలు చేశారు. మామూలుగా చెప్పాలంటే మహారాష్ట్రలో ఉన్న వయోజనుల సంఖ్య కన్నా అధికంగా అసెంబ్లీ ఎన్నికల్లో వోట్లు పడ్డాయని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ ఆరోపించారు. ‘ఎన్నికల కమిషన్ మాకు సాయంత్రం 5.30 గంటలకు వోటింగ్ గణాంకాలు ఇచ్చింది. సాయంత్రం 5.30 గంటలు, రాత్రి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది వోటర్లు వోటు వేశారు. అలా జరగడం భౌతికంగా అసాధ్యం. ఒక వోటర్ వోటు వేయడానికి సుమారు మూడు నిమిషాలు పడుతుంది. మీరు లెక్క వేస్తే తెల్లవారు జామున 2 గంటల వరకు వోటర్ల లైన్లు ఉన్నాయని అర్థం. కానీ అది జరగలేదు’ అని ఆయన చెప్పారు. ‘మేము వీడియోగ్రఫీ కోసం అడిగినప్పుడు వారు నిరాకరించడమే కాకుండా మేము వీడియోగ్రఫీ కోసం అడిగే వీలు లేకుండా చట్టాన్ని కూడా మార్చారు’ అని రాహుల్ ఆరోపించారు. ‘ఇసి రాజీ పడిందనేది సుస్పష్టం. వ్యవస్థతోనే ఏదో లోపం ఉందనేది కూడా సుస్పష్టం. నేను ఇది ఎన్నో సార్లు చెప్పాను’ అని రాహుల్ తెలిపారు. నిరుడు నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి శివసేన ఎన్‌సిపి కూటమి మహాయుతి కాంగ్రెస్, ఎన్‌సిపి(ఎస్‌పి), శివసేన (యుబిటి)తో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమిని చిత్తు చేసింది. ఇసిపై రాహుల్ వ్యాఖ్యలను బిజెపి ఎంపి, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్రంగా ఆక్షేపిస్తూ, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి చర్యపై ఆగ్రహాన్ని ఆయన ఇసిపై వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. ‘అలా చేయడం వల్ల ఏమీ జరగదు. ఇడి మిమ్మల్ని వదలిపెట్టదు. సంస్థలు వాస్తవాల ఆధారంగా పని చేస్తుంటాయి, నేషనల్ హెరాల్డ్ వ్యవహారం అందరికీ తెలిసినదే. నేరం దృష్టా మీరు, మీ తల్లి అరెస్టయి జైలుకు వెళతారు’ అని సంబిత్ పాత్రా ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయంలో విలేకరుల గోష్ఠిలో చెప్పారు. రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ ఇద్దరూ ఈ కేసు సందర్భంగా జైలుకు వెళతారు’ అని ఆయన స్పష్టం చేశారు. ‘విదేశీ భూభాగంపై భారతీయ సంస్థలను, భారతీయ ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానిస్తున్నందుకే కాకుండా నేషనల్ హెరాల్డ్ కేసులో కోట్లాది రూపాయల దేశం సొమ్మును మీరు, మీ తల్లి స్వాహా చేసినందుకు కూడా మీరు దేశద్రోహి. మీరు, మీ తల్లి దీనితో తప్పించుకుపోలేరు’ అని పాత్రా అన్నారు. రూ. 988 కోట్ల మేరకు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులపై ఇడి న్యూఢిల్లీలోని ఒక ప్రత్యేక కోర్టులో ఇటీవల ఒక చార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని వివిధ సెక్షన్ల కింద కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నంబర్ 1, 2 నిందితులగా పేర్కొంటూ ప్రాసిక్యూషన్ ఈ నెల 9న ఫిర్యాదు దాఖలు చేసింది. రాహుల్ గాంధీ శనివారం రాత్రి బోస్టన్ చేరుకుని వాణిజ్యవేత్తలు, భారతీయ సమాజం సభ్యులతో సమాలోచనలు ప్రారంభించారు. ఆయన రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. రాహుల్ అక్కడ ప్రసంగించి, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులతో ముఖాముఖి సాగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News