మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రకటన చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో వేతన సవరణ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో వేతన సవరణ ప్రకటించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఇసి అనుమతి కోరింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం పిఆర్‌సి ప్రకటనకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్నందున ఆ జిల్లాలోగానీ, ఎన్నికల ప్రచారంలోగానీ పిఆర్‌సి అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోరాదని సూచించింది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ షరతులకు లోబడి అనుమతి ఇస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్ కుమార్ స్పష్టం చేశారు. పిఆర్‌సి ప్రకటనకు వెసులుబాటు ఇచ్చినందున దాన్ని రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకోరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్ కుమార్ లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో పిఆర్‌సిపై ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా తీపి కబురు చెప్పనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒకటి, రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారు. తాజాగా ఎంఎల్‌సి ఎన్నికల్లో రెండుచోట్లా టిఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలుపొందడంతో ఉద్యోగులు ఆశించినదానికంటే కొంత ఎక్కువే పిఆర్ సిని సిఎం ప్రకటించే అవకాశముందన్న ప్రచారం కూడా సాగుతోంది. వేతన సవరణతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఇహెచ్‌ఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తదితర అంశాలపైనా ఒక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
EC Green Signal to PRC in Telangana