ఎన్నికల నిర్వహణలో సమస్యలపై సూచనలు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్(ఇసి) ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. దీనికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులు(సిఇఒలు) హాజరయ్యారు. సదస్సుకు ముఖ్య ఎన్నికల కమిషనర్(సిఇసి) సుశీల్‌చంద్ర అధ్యక్షత వహించారు. ఇసిలోని మిగతా ఇద్దరు కమిషనర్లు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తుల్ని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సిఇసి చంద్ర సూచించారని ఇసి వర్గాలు తెలిపాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమస్యలపైనే సదస్సులో చర్చించారని ఆ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్ర సూచించారని ఆ వర్గాలు తెలిపాయి. ఓటర్లకు పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని రాష్ట్రాల సిఇఒలకు సూచించారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సిఇసి సూచించారు. ఇసి సూచనలకూ, రాష్ట్రాల్లో అమలవుతున్నతీరుకూ మధ్య అంతరాలను తొలగించి, దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఎన్నికల ప్రక్రియ కోసమే ఈ సదస్సు నిర్వహించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.