న్యూఢిల్లీ: లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవిశ్వాస తీర్మానంతో పాటుగా తదుపరి ప్రధాని లేదా, ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన నాయకుడు ప్రతిపాదించే విశ్వాస తీర్మానం కూడా అవసరం అని, అంతేకాదు ఏ మధ్యంతర ఎన్నిక అయినా అసెంబ్లీ గడువులో మిగిలిన కాలానికి మాత్రమే నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇంతకు ముందు స్పష్టం చేసింది. అంతేకాదు లోక్‌సభ గడువు సాధారణంగాతొలి సమావేశం తర్వాత అయిదేళ్లు పూర్తి చేసుకున్నతేదీన కాకుండా ఒక నిర్ణీత తేదీన మొదలవుతుందని, ముగుస్తుందని రాజ్యాంగానికి ప్రతిపాదించిన సవరణల్లో ఇసి పేర్కొంది. లోక్‌సభ గడువుకన్నా ముందుగా రద్దు కాకుండా చూడడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంతో పాటుగా భావి ప్రధానిగా పేర్కొన్న వ్యక్తి నేతత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా ఒక విశ్వాస తీర్మానాన్ని కూడా తప్పనిసరిగా ప్రతిపాదించాలని, ఓటింగ్ ఈ రెండు తీర్మానాలకు కలిపి నిర్వహించాలని జమిలి ఎన్నికలపై తన సూచనలను తెలియజేస్తూ ఇసి స్పష్టం చేసింది. ఒక వేళ లోక్‌సభ రద్దుఅనివార్యమైతే కొత్తగా నిర్వహించే ఎన్నికలు ఒరిజినల్ గడువులో మిగిలి ఉన్న కాలానికి మాత్రమే నిర్వహించాలని కూడా తెలిపింది.
ఒక వేళ మిగిలి ఉన్న కాలం అంత ఎక్కువగా లేని పక్షంలో నిర్ణీత గడువు ముగిసే వరకు మంత్రివర్గ సభ్యుల సహాయం, సలహాలతో రాష్ట్రపతి పరిపాలనను కొనసాగించడానికి వీలు ఉండాలని ఇసి తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఇదే విధమైన ఏర్పాటు ఉండాలని కూడా ఎన్నికల సంఘం సూచించింది.2015 డిసెంబర్‌లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై నివేదికచ్చిన న్యాయశాఖకు చెందిన స్థాయీ సంఘం ఈ అంశంపై ఇసి చేసిన సూచనలను ప్రస్తావించింది. లోక్‌సభ గడువు ముగిసే తేదీననే అన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువు కూడా ముగియాలని కూడా ఇసి స్పష్టం చేసింది.అంటే దాని అర్థం అప్పుడున్న అసెంబ్లీల గడువును అయిదేళ్లకన్నా ముందుగా కుదించడానికి కానీ, పొడిగించడానికి కానీ వీలుండదని ఇసి సూచనలను ఉదహరిస్తూ పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అలాగే ఒక ఏడాదిలో జరగాల్సిన అన్ని ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఇసి స్పష్టమైన సూచనలు చేసింది. వీటితో పాటుగా జమిలి ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు అంటే ఓటింగ్ యంత్రాలు లాంటి వాటిని గురించి కూడా ఇసి చేసిన సూచనలను కమిటీ తన నివేదికలో పేర్కొంది.