మోడీ ప్రభుత్వంపై ఖర్గే ఆరోపణ
ఎన్నికల నిబంధనావళి మార్పునకు ఆక్షేపణ
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ పత్రాలు కొన్నిటిని ప్రజలు పరిశీలించకుండా నిరోధించేందుకు ఎన్నికల నిబంధనావళిని మార్చినందుకు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం తప్పు పట్టారు, ఎన్నికల కమిషన్ (ఇసి) సంస్థాగత సమగ్రతను ధ్వంసం చేసేందుకు మోడీ ప్రభుత్వం ‘విధానపరమైన కుట్ర’లో అది ఒక భాగం అని ఖర్గే ఆరోపించారు. ఇసి సమగ్రతను మోడీ ప్రభుత్వం ‘క్రమంగా హరిస్తుండడం’ రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపైన ముందస్తు దాడి అని కూడా ఖర్గే ఆక్షేపించారు.
సిసిటివి కెమెరా, వెబ్‌క్యాస్టింగ్ ఫుటేజ్ వంటి కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, అభ్యర్థుల వీడియో రికార్డింగ్‌ల దుర్వినియోగాన్ని నివారించేందుకు వాటిని ప్రజలు తనిఖీ చేయడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్నికల నిబంధనావళిని సవరించింది. ఎన్నికల కమిషన్ సిఫార్సు ఆధారంగా కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ప్రజల తనిఖీకి కొన్ని రకాల ‘పత్రాల’ లేదా డాక్యుమెంట్ల అందుబాటును పరిమితం చేయడానికి ఎన్నికల ప్రవర్తన నిబంధనావళి 1961లోని 93(2)(ఎ) నిబంధనను శుక్రవారం సవరించింది. ఆ పరిణామానికి ఖర్డే స్పందిస్తూ, ‘ఎన్నికల ప్రవర్తన నిబంధనావళిని మోడీ ప్రభుత్వం మొండితనంతో సవరించడం భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) సంస్థాగత సమగ్రత నాశనానికి విధానపరమైన కుట్రలో మరొక దాడి’ అని ఆరోపించారు.
‘ఇంతకు ముందు వారు ఎన్నికల కమిషనర్లను నియమించే ఎంపిక కమిటీలో నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)ని తొలగించారు. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వు తరువాత కూడా ఎన్నికల సమాచారాన్ని అడ్డుకోవడానికి వారు పూనుకున్నారు’ అని ఖర్గే విమర్శించారు. వోటర్ల పేర్లు తొలగింపు, ఇవిఎంలలో పారదర్శకత లోపం వంటి నిర్దిష్టమైన ఎన్నికల అక్రమాల విషయంలో ఇసిఐకి కాంగ్రెస్ లేఖ రాసినప్పుడల్లా ఇసిఐ స్పందన దిగజారినట్లుగా ఉంది, కొన్ని తీవ్ర ఫిర్యాదులను కనీసం గుర్తించనూ లేదు’ అని ఖర్గే ఆరోపించారు. ‘ఇసిఐ పాక్షిక న్యాయవ్యవస్థ అయినప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఇది మరొకసారి రుజువు చేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇసిఐ సమగ్రత పరిరక్షణకు తాము అన్ని చర్యలూ తీసుకుంటామని ఖర్గే తెలిపారు. ఆ సవరణను తమ పార్టీ చట్టపరంగా సవాల్ చేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్ ఇన్‌చార్జి) జైరామ్ రమేష్ తెలియజేశారు.