మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే బుల్డోజర్‌లతో తొక్కిస్తామంటూ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం వరకు వెళ్లడంతో.. ఇసి సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. కాగా.. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్.. యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు.
రాజాసింగ్ వివరణ
ఇసి నోటీసులపై బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ స్పందించారు. అఖిలేష్ ప్రభుత్వంలో మాఫియా రాజ్యం నడిచిందని.. యోగి ప్రభుత్వం వచ్చాక మాఫియాను బుల్డోజర్‌తో ఎత్తిపడేశారని రాజాసింగ్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే తాను బుల్డోజర్ వ్యాఖ్యలు చేశానని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కొందరు కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి సిఎం కాకూడదనే ఉద్దేశంతో కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.