న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. గతంలో ఇసి జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న మణిపూర్‌లో తొలి విడత పోలింగ్ జరగాల్సి ఉండగా దాన్ని 28కి మార్చింది. అలాగే మార్చి 3న జరగాల్సిన రెండో విడత పోలింగ్‌ను మార్చి 5వ తేదీకి మారుస్తున్నట్లు గురువారం తాజాగా ప్రకటించింది. ఫిబ్రవరి 27 ఆదివారం క్రైస్తవ సమాజానికి ఆరాధన దినమని..ఆ రోజున జరగాల్సిన ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలంటూ మణిపూర్ క్రైస్తవ సంస్థలు, పలు గిరిజన సంఘాలతో పాటుగా కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇసికి విజ్ఞప్తి చేశాయి.ఈ నేపథ్యంలో మణిపూర్ ఎన్నికల తేదీల్లో మార్పులు చేస్తూ ఇసి నిర్ణయం తీసుకుంది. ఇటీవల పంజాబ్ ఎన్నికల తేదీల్లో కూడా ఇసి మార్పు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 14న పంజాబ్‌లో ఒకే దశలో పోలింగ్ జరగాల్సి ఉండగా, గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ అక్కడి రాజకీయ పార్టీలు కోరడంతో పోలింగ్ తేదీని ఈ నెల 20కి మార్చిన విషయం తెలిసిందే.
మణిపూర్ పోలింగ్ తేదీల్లో మార్పులు చేసిన ఇసి
- Advertisement -
- Advertisement -
- Advertisement -