హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఇసి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల విధుల నుండి పలువురు అధికారులను తప్పించిన ఇసి తాజాగా ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఎసిపి యాదగిరి, ముషీరాబాద్ ఎసిపి జహంగీర్‌లను ఇసి సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పార్టీల డబ్బుల పంపిణీలో పక్షపాతం చూపారని వీరిపై వేటు వేసినట్లు ఇసి వెల్లడించింది. ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఇసి లేఖ రాసింది.
ఆ ముగ్గురు పోలీసు అధికారులపై హైదరాబాద్ నగర కమిషనర్ సందీప్ శాండిల్యా సస్పెన్షన్ వేటు వేశారు. ముషీరాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి డబ్బులు పంచుతుంటే చర్యలు తీసుకోలేదని అభియోగాలున్నాయి. ముషీరాబాద్ పరిధిలో నగదును స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పక్షపాతం చూపించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం రాసిన లేఖలో పేర్కొంది.
మెదక్‌లో ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్
తెలంగాణ ఎన్నికలు 2023లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కేంద్ర / రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేయాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కూల్చారం మండలంలోని పైతరా గ్రామంలో గ్రామంలో నీటి సరఫరా చేసే ఉద్యోగి బట్ట జీవయ్య ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రాజకీయ పార్టీలో చేరి ప్రచారం చేస్తూ విధులను నిర్లక్ష్యం చేశాడని సి- విజిల్ యాప్ ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదుపై ఉన్నత శాఖల అధికారులు విచారణ చేయగా, అది నిజమేనని తేలడంతో ఉద్యోగి జీవయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మాసాయిపేటలోని పశు సంవర్ధకశాఖ లోని ప్రాథమిక కేంద్రంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న కె.విద్యాసాగర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా గ్రామంలో రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న ప్రచారంలో పార్టీ కండువా వేసుకుని ప్రచారం చేశారని, వీడియో రికార్డుతో ఫిర్యాదు వచ్చింది. వివిధ శాఖ అధికారులతో నిర్ధారణ చేయగా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనిచేసినట్లు రుజువైనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ ప్రచారాలలో పాల్గొనకూడదని, ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవలసివస్తుందని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఓ ప్రకటనలో తెలిపారు.