లోక్‌సభలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి
న్యూఢిల్లీ: ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాలలో ఓటరుగా నమోదు చేసుకోవడాన్ని నిరోధించేందుకు ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న ఎన్నికల కమిషన్ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. ఒకే వ్యక్తి వివిధ ప్రదేశాలలో ఓటరుగా నమోదు చేసుకునే బెడదను నిర్మూలించడానికి ఓటరు కార్డును ఆధార్ వ్యవస్థతో అనుసంధానం చేయాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదన చేసినట్లు ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిస్తూ మంత్రి వివరించారు. దీనికి ఎన్నికల చట్టాలలో సవరణలు తీసుకురావలసి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్ తెలిపిందని మంత్రి చెప్పారు.
ఆధార్ వ్యవస్థలోకి ఎన్నికల జాబితా వ్యవస్థ చొరబడలేదని, రెండు వ్యవస్థల మధ్య ఎటువంటి సంబంధం ఉండదని ఆయన అన్నారు. కేవలం ఓటరుకు గుర్తింపు కార్డుగా మాత్రమే ఆధార్ ప్రస్తుతం ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. ఈ రెండు వ్యవస్థల మధ్య దూరం వల్ల ఓటర్ల జాబితాలో చొరబాటు లేదా చౌర్యానికి ఆస్కారం లేదని ఆయన వివరించారు. ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారితోపాటు ఇదివరకే ఓటరు కార్డు పొందిన వారి ఆధార్ నంబర్లను ఎన్నికల కమిషన్ తీసుకునేందుకు వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకురావాలని ఎన్నికల కమిషన్ గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది.