అఖిలేశ్ వీడియో ఫిర్యాదు ఫలితం
లక్నో : వారణాసిలో ఇవిఎంలు చోరీకి సంబంధించి వారణాసికి చెందిన సీనియర్ అధికారిపై సస్పెన్షన్‌కు రంగం సిద్ధం అయింది. అక్కడ ఇవిఎంలను ట్రక్కులలో తరలిస్తున్నారని, ఇందుకు స్థానిక అధికారులు సహకరించారని ఎస్‌పి నేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. సంబంధిత ఉదంతాన్ని తెలియచేసే వీడియోను కూడా ప్రవేశపెట్టారు. దీనికి స్పందనగా మరుసటిరోజే బుధవారం సీనియర్ అధికారిని విధుల నుంచి తప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు యంత్రాలకు సంబంధించి జిల్లా అధికారులు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఇప్పుడు స్పష్టం కావడంతో వారణాసి అదనపు కలెక్టర్ ఎన్‌కె సింగ్‌ను సస్పెండ్ చేయనున్నారు. ఎన్నికల సంఘం తమకు అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వెనువెంటనే అధికారి సస్పెన్షన్‌కు ఆదేశాలు వెలువరించింది. ఇవిఎంల తరలింపులో తప్పిదాలు జరిగినట్లు నగర పోలీసు కమిషనర్ అంగీకరించారు. ఉదయం పూట తరలించాల్సిన ఇవిఎంలను అదనపు కలెక్టర్ తమ సొంత నిర్ణయంతో రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనాలలో తీసుకువెళ్లినట్లు విచారణ క్రమంలో వెల్లడైంది. దీనితో జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ కూడా తన జూనియర్ సస్పెన్షన్‌కు సమ్మతించారు.