Monday, January 20, 2025

బిజెపి గుప్పిట్లో ఇసి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి కనుసన్నుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. అందుకే కెసిఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించారని ధ్వజమెత్తారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య,రావుల చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి కెటిఆర్ మీడియా సమావే శం నిర్వహించారు.ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ..మోదీ, అమిత్ షా మత వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినా ఇసి చర్య తీసుకోలేదని విమర్శించారు. మోదీ దారుణంగా మా ట్లాడినా ఇసి కనీసం స్పందించలేదని అన్నారు. 20 వేల పైచిలుకు ప్రజలు ఇసికి ఫిర్యాదు చేసిన కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా భయపడి బిజెపి అధ్యక్షుడు నడ్డాకు లేఖ ద్వారా నోటీసు లు ఇచ్చారని పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీరాముని బొమ్మ పట్టుకొని ప్ర చా రం చేశారని ఫిర్యాదు చేసిన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ రైతుల పక్షాన మాట్లాడితే ఆయన 48 గంటలు ప్రచారం నిర్వహించొద్దని ఇసి నిషేధం విధించిందని ధ్వజమెత్తారు. సిఎం రేవంత్‌రెడ్డిపై తమ పార్టీ ఎనిమిది ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని తెలిపారు. ఇసికి ఎన్ని ఫిర్యాదులు చేసినా గోడకు మొరపెట్టుకున్నట్లు ఉందని మండిపడ్డారు. కెసిఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు నిద్ర పట్టలేదని అన్నారు. కెసిఆర్ బస్సు యాత్ర ప్రారంభించగానే బిజెపి,కాంగ్రెస్‌కు దడపుట్టిందని, కెసిఆర్ వాస్తవాలు చెబుతుంటే తట్టుకోలేక ఇలా చేస్తున్నారని అన్నారు. బిఆర్‌ఎస్‌కు 12 ఎంపి సీట్లు వస్తాయని కాంగ్రెస్, బిజెపి సర్వేల్లో తేలిందని, అందుకే కెసిఆర్ విషయంలో ఇసి ఆగమేఘాలపై నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. రైతుల దుస్థితి చూసి బాధతో భావోద్వేగంతో కెసిఆర్ సిరిసిల్లలో మాట్లాడారని, ప్రజలు, రైతులు, నేతన్నల తరఫున మాట్లాడిన కెసిఆర్ గొంతును నొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నేత కెసిఆర్‌పై సిఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇసికి ప్రవచనాలు, సూక్తులుగా వినిపిస్తున్నాయా..? అని ప్రశ్నించారు. ఇసికి మెుత్తం 27 ఫిర్యాదులు ఇచ్చామని, అందులో కేవలం కొండా సురేఖను మాత్రమే మందలించారని చెప్పారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఈసీ శైలి
బిఆర్‌ఎస్‌కు 8 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని కెటిఆర్ కోరారు. కెసిఆర్ 48 గంటల పాటు ప్రచారం నిర్వహించకుండా తాత్కాలికంగా అపారేమో కానీ, ప్రజల మనస్సుల్లోంచి ఆయనను ఎవరూ తొలగించలేరని పేర్కొన్నారు. మోదీ, రేవంత్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేసేలా ఇసి వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం అని, ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడం కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఇలాగే కొనసాగితే ప్రశాంత, పారదర్శకత ఎక్కడిదని ప్రశ్నించారు.

కెసిఆర్ ట్వీట్ చేసిన వెంటనే చీఫ్ వార్డెన్‌కు షోకాజ్ నోటీసు
ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న మంచినీరు, విద్యుత్ కొరత విషయంలో సిఎం రేవంత్ రెడ్డి ఫేక్ సర్క్యులర్ ట్వీట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కెటిఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన సర్క్యులర్ ఫేక్ కాదని నిరూపిస్తే తాను చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. నెల రోజుల పాటు హాస్టల్స్, మెస్‌లు మూసివేస్తున్నాం… తీవ్రమైన నీటి కొరత, విద్యుత్ సమస్య ఉందని, విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేసి అధికారులకు సహకరించాలని మార్చి 18వ తేదీన ఒయు చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేశారని, దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమించారని చెప్పారు. దాదాపు 11 రోజుల తర్వాత కెసిఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓయూ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులను, విద్యార్థుల ఆందోళనలను ట్యాగ్ చేస్తూ ఒయులో కూడా మంచినీటి కొరత, విద్యుత్ కొరత ఉందని చెప్పి హాస్టళ్లను మూసివేస్తున్నారని పేర్కొన్నారు.

కెసిఆర్ ఈ నెల 29న మ. 3.46కు ట్వీట్ చేస్తే.. వెంటనే చీఫ్ వార్డెన్‌కు రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసు జారీ చేశారని అన్నారు. ఇంకా విచిత్రంగా ఎస్‌పిడిసిఎల్ నుంచి ఇంకో నోటీసు ఇచ్చారని, అందులో వైస్ ఛాన్స్‌లర్‌కు బదులుగా వైస్ చైర్మన్ అని రాశారని చెప్పారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్‌పిడిసిఎల్ వారు అడిగారని పేర్కొన్నారు. ఆ తర్వాత సిఎం రేవంత్‌రెడ్డి కెసిఆర్‌ను చూస్తుంటే గోబెల్ పుట్టినట్టు ఉందదంటూ ట్వీట్ చేశారని పేర్కొన్నారు. 2023 మేలో కూడా ఇలాగే నోటీసులు జారీ చేశారని, ఆ నోటీసుల్లో విద్యుత్, నీటి కొరత ప్రస్తావించినట్లు రేవంత్ రెడ్డి ఒక నోటీసు పెట్టి ఇరుక్కుపోయారని చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన వెధవ పనికి తమ పార్టీ నాయకుడు క్రిశాంక్‌ను అరెస్టు చేశారని అన్నారు. ఇప్పుడు జైల్లో ఉండాల్సింది ఎవరు.. ఫోర్జరీ డాక్యమెంట్ చేసిన ముఖ్యమంత్రా..?..సిఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ప్రజలకు తెలియజేసినా క్రిశాంకా…? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఫోర్జరీ చేయడం నేరం అని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆధారాలన్నీ జడ్జి ముందు పెడుతామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News