లాహోర్: భద్రతా కారణాల పేరుతో న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తమ దేశంలో జరగాల్సిన సిరీస్‌లను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడం ఎంతో బాధకు గురి చేసిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. తొలి వన్డే ఆరంభానికి ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రమీజ్ తప్పుపట్టారు. ఇక కివీస్ బాటలోనే ప్రయాణిస్తూ ఇంగ్లండ్ బోర్డు కూడా తమతో జరగాల్సిన సిరీస్‌లను రద్దు చేసుకోవడం తమ క్రికెట్‌కు తీరని నష్టం కలిగించిందన్నారు. భద్రతా కారణాల పేరుతో ఇంగ్లండ్ బోర్డు తమ పురుషులు, మహిళల జట్ల సిరీస్‌ను రద్దు చేసుకోవడం మంచిది కాదన్నారు. ఇంగ్లండ్, కివీస్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రం సముచితంగా లేవన్నారు. ఇటీవల కాలంలో భద్రతా పేరుతో ఆసియా దేశాల్లో జరగాల్సిన సిరీస్‌లను రద్దు చేసుకోవడం పాశ్చాత్య దేశాలకు అలవాటుగా మారాయన్నారు. ఇక పాక్ గడ్డపై జరిగే సిరీస్‌లను విజయవంతంగా నిర్వహించే సత్తా తమకుందన్నారు. ప్రపంచంలోని కొన్ని క్రికెట్ బోర్డులు పాకిస్థాన్‌లో క్రికెట్‌కు మనుగడ లేకుండా చేయాలని కుట్రపన్నుతున్నాయని రమీజ్ వాపోయారు. ఇందులో ఇవి సఫలం కావడం కష్టమని జోస్యం చెప్పారు.
ECB Cancelled Pakistan Tour