మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు(లాటరల్ ఎంట్రీ) కోసం నిర్వహించే ఇసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ మంగళవారం (ఆగస్టు 24) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 26 నుంచి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. వచ్చే నెల 2వ తేదీన మొదటి విడత ఇసెట్ సీట్లను కేటాయించనున్నారు. ఇంజనీరింగ్‌లో మొత్తం 9,741 సీట్లు అందుబాటులో ఉండగా, 11 యూనివర్సిటీలలో 744 సీట్లు, 158 ప్రైవేట్ కాలేజీల్లో 8,997 సీట్లు ఉన్నాయి. అలాగే ఫార్మసీలో మొత్తం 1,043 సీట్లు అందుబాటులో ఉండగా, 3 యూనివర్సిటీలలో 73 సీట్లు, 58 ప్రైవేట్ కాలేజీల్లో 970 సీట్లు అందుబాటులో ఉన్నాయి.