ఎపి నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తక్షణం విధుల్లో చేరాలన్న ఇసి ఆదేశాలతో మంగళగిరిలోని కార్యాలయంలో ఆయన పోలీస్‌బాస్‌గా విధుల్లో చేరారు. అంతకు ముందు ఆయనకు పోలీసు అధికా రులు గౌరవ వందనం సమర్పించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ప్రతిపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో విచారించిన ఎన్నికల సంఘం ఆదివారం డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు వేసిన సంగతి విదితమే.
ఈ క్రమంలో ఇసి ఆదేశాలతో కొత్త డిజిపి ఎంపిక కోసం ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇసి పంపించింది. సీనియరిటీ జాబితాలో ఉన్న ఐపిఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను కొత్త పోలీస్ బాస్ పోస్ట్ కోసం సిఫార్సు చేసింది. వీరిలో 1992వ బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను నూతన డిజిపిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఇసి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాగా, హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు.