రాష్ట్రంలోని ప్రధాన స్థానిక పత్రికలన్నీ తమ వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రకటనలు సహా అన్నింటికీ బాధ్యులను చేసింది భారత ఎన్నికల సంఘం.
న్యూఢిల్లీ: రాజకీయ ప్రకటనలలో ‘ధృవీకరించని’ క్లెయిమ్‌లకు సంబంధించిన ఫిర్యాదుల దృష్టా భారత ఎన్నికల సంఘం(ఈసిఐ) అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులను ప్రింట్‌లో ఏదైనా ప్రకటనను ప్రచురించే ముందు మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ(ఎంసిఎంసి) నుండి ‘క్లియరెన్స్’ పొందాలని కోరింది. పోలింగ్ తేదీ, దానికి ముందు రోజు ప్రచురించే ఏ ప్రకటనకైనా ఇది తప్పనిసరి. ఈ మేరకు మే 7న అన్ని పార్టీలకు లేఖను పంపింది.
తన లేఖలో ఈసిఐ ‘వార్తాపత్రికలో ప్రచురించబడే ప్రకటనలతో సహా అన్ని విషయాలకు సంపాదకుడు బాధ్యత వహించాలి. బాధ్యతను నిరాకరిస్తే, దానిని ముందుగానే స్పష్టం చేయాల్సి ఉంటుంది’ అని పేర్కొంది. ప్రింట్ మీడియాలో ప్రచురితమైన అభ్యంతరకర, తప్పుదోవ పట్టించే తరహా ప్రకటనలను గతంలో కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాజకీయ పార్టీలకు తెలిపింది. పార్టీలకు ఇచ్చిన అడ్వయిజరీలో, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సొమవారంతో ముగియనున్నదని తెలిపింది.