Thursday, December 19, 2024

ఫిరాయింపు వర్గం చేతికే పార్టీ

- Advertisement -
- Advertisement -

శివసేనకు జరిగినట్టుగానే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) విషయంలోనూ సంభవించింది. దానిని చీల్చి అధికార కూటమిలో చేరిన అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్‌సిపి అని ఎన్నికల కమిషన్ తీర్పు చెప్పింది. కీలకమైన లోక్ సభ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ నిర్ణయం సీనియర్ నేత, ‘ఇండియా’ కూటమి ముఖ్యుల్లో ఒకరైన శరద్ పవార్‌కు గట్టి దెబ్బే. ఈ పరిణామం మహారాష్ట్రలో ‘ఇండియా’ కూటమి విజయావకాశాలను తగ్గించే సూచనలున్నాయి. పిఎ సంగ్మా, తారిక్ అన్వర్లతో కలిసి 1999 జూన్‌లో శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ఆయన పేరు ఎన్‌సిపికి పర్యాయ నామంగా కొనసాగుతూ వచ్చింది. ఒకే వ్యక్తికి గల జంట పేర్లుగా అవి పరిగణన పొందుతున్నాయి. ఇప్పుడు దేశ అత్యున్నత ఎన్నికల సంఘమే శరద్ పవార్ వద్ద నుంచి ఆ పేరును తొలగించి ఫిరాయింపుదార్ల గురువు, ఆయన సన్నిహిత బంధువు అజిత్ పవార్ వర్గానికి కట్టబెట్టడం, పార్టీ గుర్తును సైతం దానికే ఇవ్వడం ఆశ్చర్యం కలిగించక మానదు. పార్టీ ప్రధాన కార్యాలయం సైతం అజిత్ పవార్ వర్గానికే చెందిపోతే ఆశ్చర్యపోనవసరం లేదు.

ఈ మాదిరి చర్యలతో బలమైన ప్రతిపక్షాలను ప్రజలకు దూరం చేసి, వాటిని నిర్వీర్యం చేసే దుర్మార్గం సాగుతున్నదనే అభిప్రాయం కలగడాన్ని తప్పుపట్టలేము. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శకు బలం చేకూరుతున్నది. పార్టీ నియమావళి పాటింపు, శాసన సభలో బలాబలాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొన్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషనర్ల నియామక విధానం నిష్పక్షపాతంగా లేనందుకు ఆగ్రహించిన సుప్రీం కోర్టు రాజ్యాంగంలో చెప్పిన విధంగా పార్లమెంటులో అందుకు ఒక చట్టం చేసేలోగా ప్రధాని, ప్రతిపక్ష నేత, సిజెఐతో కూడిన ఎంపిక కమిటీని వేసిన విషయం తెలిసిందే. ఇందులో నుంచి సిజెఐని తప్పించి అందుకు బదులుగా కేంద్ర మంత్రిని ఒకరిని చేరుస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింప జేసుకోడంలోని ఆంతర్యం ఇప్పటికైనా అర్ధం అవ్వాలి. ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ వర్గానికి 41, శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎంఎల్‌ఎల బలం ఉంది. అధికార కూటమిలో చేరే వారి బలం ఎక్కువగా ఉండడం సహజమే. పార్టీ ఫిరాయింపులను అరికట్టడం ద్వారా రాజ్యాంగం పదవ షెడ్యూలును

కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత గలిగిన ఎన్నికల సంఘం నిర్ణయాలు కేంద్ర పాలక పక్షానికి మేలు చేసే విధంగా ఫిరాయింపుదార్ల కొమ్ము కాస్తూ వెలువడడం గమనించవలసిన విషయం. అతి ముఖ్యమైన ఎన్నికలకు ముందు పాలకులకు గల బలమైన రాజకీయ ప్రత్యర్థుల చేతిలోని పదునైన ఆయుధాలను ఊడబెరకడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఇసి నిర్ణయం వెనుక అదృశ్య హస్తమున్నదని శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే చేసిన ఆరోపణ నిరాధారమైనదని అనిపించడం లేదు. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికి కక్కుర్తిపడి రెండు సార్లు ఎన్‌సిపి నుంచి అధికార కూటమిలో ప్రవేశించారు. మొదటిసారి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా, తనను ఉపముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో హడావిడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన ఘట్టం కంపు కొట్టడంతో తిరిగి ఎన్‌సిపిలోకి వచ్చి చేరారు. బీహార్‌లో నితీశ్ కుమార్ మరోసారి పల్టీ కొట్టిన తర్వాత పొరుగునున్న జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేసి అధికారచ్యుతుని చేయడం, ఇప్పుడు ఇలా శరద్ పవార్ మూలాలపై దెబ్బ కొట్టడం వేటికవి వేర్వేరుగా జరిగిన ఘటనలు అనిపించడం లేదు.

లోక్‌సభ ఎన్నికలలోగా ప్రతిపక్షం మీద ఇంకెన్ని అనైతికమైన వేట్లు పడనున్నాయో! చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య హత్య జరిగిందని ఆవేదన చెందిన దేశ అత్యున్నత న్యాయ స్థానం ఫిరాయింపుదార్లు అధికార కూటమిలో చేరడం ద్వారా పదవులు, ఇతర ప్రయోజనాలను ఆశచూపి సభలో మెజారిటీ సాధించుకోడంలోని అక్రమాన్ని గమనించి చట్టానికి అవసరమైన సవరణలను ఆదేశించవలసి వుంది. ఒక పార్టీలో ప్రత్యర్థి వర్గం చర్య ఫిరాయింపు కిందికి వచ్చినప్పుడు దానికి ఆ పార్టీలో మెజారిటీ ఉందా లేక మైనారిటీ వుందా అనేది ముఖ్యం కాదని, దానితో నిమిత్తం లేకుండా 10వ షెడ్యూలు వర్తిస్తుందని గత మార్చిలో శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం తరపు వాదనలు విన్నప్పుడు సుప్రీం కోర్టు వ్యాఖ్యనించింది. ఇందుకు అనుగుణంగా కఠినమైన చర్యలకు ఆదేశించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మానికి కవచాన్ని ఏర్పాటు చేయాలి. ఎన్నికల సంఘాన్ని దారిలో పెట్టడం తక్షణ అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News