Monday, December 23, 2024

ఎకో టూరిజం పున:ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో అటవీ అందాలు ఆస్వాదించేలా ‘వైల్డ్ లైఫ్ టూరిజం’ ను పున: ప్రారంభించారు. ములుగు జిల్లా పరిధిలో లక్నవరం, తాడ్వాయి, బొగత అటవీ ప్రాంతాల్లో కరోనా కారణంగా నిలిచిపోయిన పర్యావరణ పర్యాటకాన్ని మళ్లీ ప్రారంభించినట్లు అటవీశాఖ ప్రకటించింది. తాడ్వాయి హట్స్‌తో పాటు, లక్నవరం, బ్లాక్ బెర్రీ ఐలాండ్స్ వద్ద సైక్లింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛతీస్‌ఘడ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పర్యాటకులను లక్నవరంతో పాటు, బొగత జలపాతం ప్రాంతాలు ఆకర్షిస్తున్నాయి. వీటితో పాటు పరిసర అడవులలో దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. రాజధాని నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతాలు ఉన్నాయి.

ఐదున్నర గంటల ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు. రాత్రి బసకు లక్నవరం దగ్గర టూరిజం హోటళ్లతో పాటు, తాడ్వాయిలో అటవీశాఖ హట్స్ అందుబాటులో ఉన్నాయి. లక్నవరం, తాడ్వాయి, బొగత చుట్టు పక్కల ప్రాంతాలను కలిపి రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం (బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకం) సర్క్యూట్ ను అటవీ శాఖ అభివృద్ది చేస్తోంది. వీటిని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను లక్నవరం ఫెస్టివల్ పేరుతో గతంలో అమలు చేసింది. అయితే కరోనా కారణంగా రెండేళ్లకు పైగా ఈ కార్యక్రమాలు నిలిచిపోయాయి. తాజాగా ఇప్పుడు పున:ప్రారంభం జరిగింది.
దట్టమైన అడవులు.. ప్రకృతి రమణీయతకు నెలవులు
ఈ పర్యాటక ప్రాంతాల చుట్టూ పరుచుకున్న అటవీ ప్రాంతాలు, పారే నదులు, నీటి కొలనులు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. అడవిని అర్థం చేసుకోవటంతో పాటు, ప్రాధాన్యతను తెలిపేలా కొత్త కార్యక్రమాల రూపకల్పన జరిగింది. అడవుల ప్రాధాన్యతను అర్థం చేసుకోవటంతో పాటు, అటవీశాఖ నేతృత్వంలో అడవుల నిర్వహణపై కూడా పర్యాటకులకు అవగాహన కల్పించనున్నారు. గడ్డి మైదానాల పెంపు (గ్రాస్ లాండ్స్), సోలార్ బోర్‌వెల్స్, నీటి యాజమాన్య పద్దతులు (పర్కులేషన్ ట్యాంక్స్) స్థానిక అటవీ అధికారులు వివరిస్తారు.

ప్రస్తుతం లక్నవరంతో పాటు తాడ్వాయి హట్స్ దగ్గర రెండు నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో అటవీ అందాలను వీక్షించేందుకు వీలుగా ట్రెక్కింగ్, సైక్లింగ్ ప్రారంభమైంది. ఒక గంటకు వంద రూపాయలు చెల్లించి సైక్లింగ్ అనుభూతిని ఇక్కడ పొందవచ్చు. దారిలో లక్నవరం అలుగు, తూములు, వాచ్ టవర్ నుంచి బర్డ్ వాచింగ్, అటవీ, సరస్సు అందాలను వీక్షించవచ్చు. అటవీశాఖ ద్వారా గైడ్ కూడా అందుబాటులో ఉంటారు.
అడవిలో రాత్రి బస… పురాతన రాకాసి గుహల సందర్శన..
తాడ్వాయి సమీపంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ (రివర్ ఐలాండ్), డోల్మెన్ సమాధులు (పురాతన రాకాసి గుహలు)ను సందర్శించేలా అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. లక్నవరం సమీపంలో ఒక రాత్రి టెంట్‌లో బసచేసేలా మొత్తం 24 గంటలు ప్యాకేజీ త్వరలో అందుబాటులోకి రానుంది.తాడ్వాయి హట్స్ నుంచి సఫారి వాహనంలో 20 కిలో మీటర్లు ఐలాపూర్ వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరించే అవకాశముంది. అటవీశాఖ తరపున సఫారీ వాహనం అందుబాటులో ఉంటుంది. అన్ని అటవీ ప్రాంతాలను ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామని, సందర్శకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. వివరాలకు లక్నవరం – 8074827875, తాడ్వాయి 7382619363 నెంబర్‌లలో సంప్రదించవచ్చునని అధికారులు వెల్లడించారు.
అందుబాటులోకి మరిన్ని అటవీ పర్యాటక ప్రాంతాలు : డోబ్రియల్
ప్రభుత్వ అనుమతితో త్వరలోనే రాష్ట్రంలోని మరిన్ని అటవీ పర్యాటక ప్రాంతాల వివరాలు వెల్లడిస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ & హెచ్‌ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు. పలు జిల్లాల్లో అటవీ ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రాంతాలను గుర్తించాం.. వాటి సందర్శనకు వీలుగా తగిన కొత్త ఎకో టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News