దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టు పక్కల దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్‌లు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కూడా పతనం దిశగా వేగంగా పరుగెడుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏమవుతుందోననే భయాలు పెరిగిపోతున్నాయి. రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి పతనం కావడం చిన్న విషయం కాదు. దీని ప్రభావం పలు రంగాలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్యుడి జీవన చక్రానికి కీలకమైన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా పెరగడం ఖాయం. ఇప్పటికే సబ్సిడీ వంట గ్యాస్ ధర 1105 రూపాయలుగా ఉంది. ఇప్పుడు రూపాయి పతనంతో గ్యాస్ ధర మరింతగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు రూపాయి విలువ కూడా జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటుతున్నాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మరో వైపు నిరుద్యోగం పెరిగిపోతోంది. ధరల మోత మోగిపోతోంది. కొవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న సంకేతాలు కనిపించినా అది నిజం కాదని తేలిపోయింది. ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. మొదట నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. తర్వాత ద్రవ్యోల్బణం కోరలు చాచింది. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కూడా అడుగంటుతున్నాయి.
దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టు పక్కల దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్‌లు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కూడా పతనం దిశగా వేగంగా పరుగెడుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏమవుతుందోననే భయాలు పెరిగిపోతున్నాయి. రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి పతనం కావడం చిన్న విషయం కాదు. దీని ప్రభావం పలు రంగాలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్యుడి జీవన చక్రానికి కీలకమైన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా పెరగడం ఖాయం. ఇప్పటికే సబ్సిడీ వంట గ్యాస్ ధర 1105 రూపాయలుగా ఉంది. ఇప్పుడు రూపాయి పతనంతో గ్యాస్ ధర మరింతగా పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ రేట్లు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎప్పుడో సెంచరీ కొట్టేశాయి. ఇప్పుడు వీటి ధరలు ఇంకా మరింతగా పెరుగుతాయి. పెట్రోల్ ధరలు పెరిగితే ఆటోమేటిగ్ గా వస్తువుల రవాణా భారమవుతుంది.దీంతో నిత్యవసరాల వస్తువులు పెరుగుతాయి.
ఇవాళ ఆహారం, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, దుస్తులు, పాదరక్షలు మొదలుకొని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటి ధరలూ పెరిగిపోయాయి. దేశమంతటా దాదా పు అన్ని చోట్లా పెట్రోల్ ధర లీటరుకు 110 రూపాయలు దాటిపోయింది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో సరకుల రవాణా వ్యయం పెరిగిపోయింది. అప్పుడు ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ కొండెక్కి కూర్చుంటుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్‌బిఐ తీసుకున్న రెపో రేటు పెంపు నిర్ణయం కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇంధనంపై పన్నులతో పాటు జిఎస్‌టిని తగ్గించి పేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించి, ఎంఎస్‌ఎంఇ రంగానికి నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థికాభివద్ధికి ఊపునివ్వాలి. దాని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయినా కేంద్రం ఇంత వరకు ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. నిజానికి కొవిడ్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. కొవిడ్ కాలంలో కుదేలైన పరిశ్రమలు, వ్యాపారాలు ఇంకా గాడిన పడలేదు.
ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మంది మళ్లీ పనిలో కుదురుకోలేదు. ఈలోగానే ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతుండటం ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. దేశంలో ఇప్పటికీ లేబర్ ఫోర్స్‌లో 40 శాతం మంది మాత్రమే యాక్టివ్ అయ్యారు. ఇంకా 60 శాతం మంది ఏం చేస్తున్నారో లెక్కల్లేవు. ఆర్థిక వ్యవస్థ వారి కంట్రిబ్యూషన్ ఏంటో తెలియని అయోమయం నెలకొంది. అటు వ్యవసాయ కార్మికుల సంఖ్య గణనీయంగా ఉన్నా వారి ఆదాయాలు అంతంత మాత్రమే. వాళ్లు బతకడమే కష్టంగా ఉన్నప్పుడు ఇక ఆర్థిక వ్యవస్థకు ఏం కంట్రిబ్యూట్ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆర్థిక వ్యవస్థ కొవిడ్ ముందు నాటికి చేరుకోవాలంటే పుష్కర కాలం పడుతుంది. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
రాష్ట్రాల తలసరి ఆదాయంలోనూ విపరీతమైన తేడాలున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే ఆర్థిక సర్వే రూపొందించడం కూడా చాలా కష్టమైపోతుంది. దేశంలో రాజకీయంగా పెరుగుతున్న సంక్లిష్టతలు కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. చాలా విషయాల్లో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలేవీ ఫలితాన్నివ్వడం లేదు. రాష్ట్రాలు మనస్ఫూర్తిగా సహకరించకుండా వాటిని భాగస్వామ్యం చేయకుండా చేసే ఏ సంస్కరణలతోనూ ఉపయోగం లేదు. మరో పక్క దేశంలో విద్యుత్ సంక్షోభం కూడా తరుముకొస్తోంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయం చూడకుండా హడావుడిగా పునరుత్పాదక ఇంధనాల నుంచి వచ్చే విద్యుత్ వైపు మళ్లాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎదురుతన్నింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బొగ్గు సంక్షోభంలో కూరుకుపోయాయి. బొగ్గు గను లు లేని రాష్ట్రాలే కాదు ఉన్న రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా తలాతోకా లేని నిర్ణయాలతోనే కేంద్రం కొంప ముంచుతోంది. అసలు కొవిడ్ ముందు నుంచీ మన ఆర్థిక వ్యవస్థ స్తబ్ధుగానే ఉంది. సజావుగా సాగుతున్న ఆర్థిక రథానికి పెద్ద నోట్ల రద్దు పెద్ద కుదుపే ఇచ్చింది.
అప్పట్నుంచీ ఆర్థిక వ్యవస్థ నేల చూపులే చూస్తోంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోకుండా ఆర్థికపరమైన సమస్యలు తగ్గే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఆర్థిక తిరోగమనానికే దారితీస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నా ఫలితం కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వంలో ఆర్థిక నిపుణులు ఎవరూ లేకపోవడం, నెలల వ్యవధిలోనే ఆర్‌బిఐ గవర్నర్లు మారడం, ఆర్థిక సలహాదారుల వరుస రాజీనామాలు అన్నీ ఆందోళనకర పరిణామాలుగానే కనపడుతున్నాయి. పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆర్థిక వ్యవస్థ మేడిపండేనన్న నిజం ఎవరికీ జీర్ణం కావడం లేదు. మన దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతుల పరిమాణం చాలా పెద్దది. ఏ దేశానికైనా దిగుమతుల బిల్లే జిడిపిని నిర్దేశిస్తుంది. దిగుమతుల భారం పెరిగేకొద్దీ ఆర్థిక సూచీలన్నీ పతనమవుతాయి. సంక్షోభం ముదురుతున్న కొద్దీ దాన్ని చక్కదిద్దటం కూడా కష్టసాధ్యమే అవుతుంది. వివేకంతో ముందే మేలుకోవాల్సిన ప్రభుత్వాలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.
ఒక దాని తర్వాత మరొకటిగా సంక్షోభాలు ముంచుకొస్తున్నా అనుకున్న స్థాయిలో ప్రభుత్వ చొరవ కనిపించడం లేదు. ఇప్పటికే ధరాఘాతంతో అల్లాడుతున్న సామాన్యులకు ముందుం ది మొసళ్ల పండగ అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్ ప్రభావంతో చాలా నష్టపోయిందని, ఆ లోటు పూడ్చుకోవడానికి కనీసం పన్నెండేళ్లు పడుతుందని ఆర్‌బిఐ నివేదిక తేల్చింది. ఆ నివేదిక ప్రకారం కొవిడ్ కారణంగా 52 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తి నష్టం వాటిల్లింది. 2020-21 తొలి త్రైమాసికంలో భారీ క్షీణత నమోదు చేసిన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండగా 2021-22 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో సెకండ్ వేవ్ కొవిడ్ పరిణామాలు మళ్లీ దెబ్బతీశాయని నివేదిక వివరించింది.
2022 జనవరిలో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం చూపినా, మొదటి రెండు దశలతో పోలిస్తే తక్కువని తెలిపింది. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా అంతర్జాతీయ, దేశీయ వృద్ధి కూడా తగ్గుతోంది. సరకుల ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరా చైన్‌లో అంతరాయాలు ఇందుకు కారణమని వివరించింది. కొవిడ్ ముందు వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంక బాటలో ఉందంటూ గణాంకాల ఆధారంగా అనేక మంది అంచనా వేస్తున్నారు. 2023లో 14 శాతం వృద్ధి రేటు సాధిస్తే తప్ప ఆర్థిక రథం పరుగు మొదలు పెట్టదు. అది పరుగు పెట్టాలంటే ధరలను నియంత్రించడం దానికి తొలి మెట్టు కావాలి. ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు.
ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్‌లో సరకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్‌లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పన్నులు, యూజర్ ఛార్జీలు, సెస్సులు, సర్‌చార్జీలు, విద్యుత్ చార్జీలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి. ఏదైనా ఇప్పుడు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని కూడా నివారించే మార్గాలున్నాయి. అయితే దీనికి ప్రభుత్వమే చొరవ చూపి ప్రపంచ పరిస్థితుల్ని గమనిస్తూ వేగంగా సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. లేకపోతే మన దేశం సంక్షోభంలో మునగక తప్పదు.
నాదెండ్ల శ్రీనివాస్
9676407140