ఆర్థికాభివృద్ధిలో ఇండియా పైపైకి దూసుకుపోతున్నది. 3.5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) తో 2022లో ప్రపంచ ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి సరికొత్త చరిత్రను సృష్టించింది. 2.83 ట్రిలియన్ డాలర్ల జిడిపి గల బ్రిటన్ ఆరో స్థానానికి పడిపోయింది. అంటే ఒకప్పటి ప్రపంచ అధినేతను మించిపోయి ఇండియా ఉజ్వల ఆర్థిక శక్తి కాగలిగింది. ప్రపంచం సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలో మన ఆర్థిక వ్యవస్థ అమోఘంగా వెలిగిపోతున్నట్టు 202223 స్థూల జిడిపి గణాంకాలు రుజువు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ గత మే 31న సగర్వంగా ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో చెప్పుకొన్నారు. అయితే ఈ మహాద్భుత ఆర్థిక ప్రగతి ప్రజల జీవితాల్లో ప్రతిఫలిస్తున్నదా అంటే లేదనే సమాధానమే గట్టిగా వినవస్తున్నది. ఆశ్రిత పెట్టుబడిదారీ, కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల కారణంగా అతి వేగంగా సిరులు పుంజుకొన్న బడా సంస్థల సంపదే జిడిపిలో ప్రతిబింబిస్తున్నది. ఇంకొక వైపు దేశ జనాభా అపరిమితంగా పెరుగుతున్నది.
అందులో పని వయసు జన సంఖ్య అదే పనిగా అధికమవుతున్నది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యుఎన్‌ఎఫ్‌పిఎ)విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదిక 2023 ప్రకారం ఇండియా అత్యధిక జన సంఖ్య గల దేశంగా అవతరించింది. ఈ విషయంలో చైనాను దాటిపోయింది. అంటే ప్రభావవంతమైన నియంత్రణ పద్ధతుల ద్వారా జన సంఖ్య పెరుగుదలను అదుపు చేయడంలో చైనా విజయవంతమై ఇండియా విఫలమైందని స్పష్టపడుతున్నది. 1564 ఏళ్ళ పని చేసే వయసులోని వారు దేశ జనాభాలో 68 శాతానికి చేరుకొన్నట్టు ప్రపంచ జనాభా నివేదిక వెల్లడించింది. అత్యధిక జనాభా పని వయసులోని వారు కావడం ఒక రకంగా మంచి విషయమే. ప్రజల శ్రమశక్తిని వినియోగించుకోడం ద్వారా దేశ సంపదను పెంచుకోడానికి అవకాశమిచ్చే అంశం. ఈ దారిలో పెరిగే జిడిపి మాత్రమే ప్రజల జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. ఇది కూడా చైనాలోనే జరుగుతున్నది. అజిమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన తాజా నివేదిక దేశంలో ఉదోగావకాశాల డొల్లతనాన్ని బయటపెట్టింది. నిర్ణీత కాలానికి ఒకసారి భారత ప్రభుత్వం జరిపించే కార్మిక శక్తి సర్వేలు, వార్షిక పారిశ్రామిక సర్వే, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వంటి పత్రాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
దేశ జిడిపి పెరుగుతున్న మాదిరిగా ఉద్యోగావకాశాలు ఎగబాకడం లేదని చాలా కాలం క్రితమే నిర్ధారణ అయిన వ్యతిరేక ధోరణి ఇప్పటికీ కొనసాగుతున్నదని ఈ నివేదిక నిగ్గు తేల్చింది. విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడం ద్వారా తయారీ రంగాన్ని బాగా అభివృద్ధి పరిచి 2025 నాటికి 10 కోట్ల అదనపు ఉద్యోగాలు సృష్టించే పరమోత్కృష్టమైన లక్షంతో 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఘనంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా పథకం సరైన అమలకు నోచుకోక దారుణంగా విఫలమైంది. కొవిడ్ తదితర సంక్షోభాల కారణంగా చైనా నుంచి విదేశీ పెట్టుబడి భారీగా భారత దేశానికి తరలి వస్తుందని వేసుకొన్న అంచనాలు ఫలించలేదు. ఆర్థిక సంస్కరణలను మరింత వేగంగా, విస్తారంగా అమలు చేసినప్పటికీ, ప్రభుత్వ రంగ పెట్టుబడులను ప్రైవేటుకు ధారాదత్తం చేసినప్పటికీ అది ఉద్యోగాల కల్పనలో ఎంత మాత్రం ఉపయోగపడకపోడం కళ్ళముందున్న కఠోర వాస్తవం. డిగ్రీ పూర్తి చేసుకొని బయటపడుతున్న యువతలో దాదాపు సగం (47 శాతం) మందికి ఉద్యోగాలు లభించడం లేదు.
ఇందుకు వారిలో తగినంతగా నైపుణ్యాలు లేకపోడం ఒక కారణంగా కాగా, తయారీ రంగం ఆశించిన స్థాయిలో పెరగకపోడం మరో కారణం. వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు తరలిపోతున్న యువతకు ఆధారపడదగిన స్థాయి పనిపాట్లు దొరకకపోడం మరో విషాదం. గ్రామాల నుంచి నగరాలకు తరలిపోతున్న పురుషులు నిర్మాణ రంగంలో చేరుతుండగా, మహిళలు నెమ్మది నెమ్మదిగా పని రంగం నుంచి దూరమవుతున్నారు. గ్రామీణ భారత పనిపాట్లలో 2000 లలో 40 శాతంగా వున్న మహిళలు ఇప్పుడు 28 శాతానికి పడిపోయారు. కార్మికశక్తిలో మహిళలే కాదు పురుషుల పాత్ర కూడా తగ్గిపోతున్నదని ఇది దేశ ఆర్థిక రంగానికి అరిష్టమని అజీమ్‌ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ నివేదిక కుండబద్దలు కొట్టింది. మరో వైపు ప్రైవేటు పెట్టుబడి కూడా తగ్గిపోతున్నదని స్పష్టం చేసింది. తయారీ రంగాన్ని అభివృద్ధి పరచుకోడం ఒక్కటే ఈ దుస్థితికి విరుగుడు కాగలుగుతుంది. దేశ యువతకు గట్టిగా ఆధారపడదగిన, జీవితావసరాలను పరిపూర్ణంగా తీర్చగల స్థిరమైన ఉద్యోగావకాశాలు కల్పించడంలో దాదాపు పదేళ్ళ ప్రధాని మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రుజువవుతున్నది.