Monday, December 23, 2024

ఆర్థికాభివృద్ధి… అంకెల గారడీ!

- Advertisement -
- Advertisement -

సాధారణంగా ఆర్థిక సంబంధ అంశాలు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆకర్షణీయమైన నినాదాలు మినహా ఆర్థిక వాస్తవాలు ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేవు. 1971లో ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం ఆమెకు రాజకీయంగా లబ్ధి చేకూర్చింది. కానీ 2004లో ‘భారత్ వెలిగిపోతుంది’ ప్రచారం వాజపేయిని పరాజయం వైపు నెట్టివేసింది. స్వతంత్ర భారత దేశంలో ఓ ప్రధాని పనితీరు ఆధారంగా, అది కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచి ప్రజల జీవితాలలో వెలుగులు కలిగించారని అభిప్రాయంతో డా. మన్మోహన్ సింగ్‌కు 2009 లో మాత్రమే పట్టం కట్టడం జరిగింది. తమ ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఎన్నికల్లో గెలుపొందిన ప్రధాని మరెవ్వరు లేరని చెప్పవచ్చు. భావోద్వేగాలు కలిగించి, రాజకీయ ప్రత్యర్థులపై పెద్ద ఎత్తున మాటలదాడి జరుపుతూ తనదైన శైలిలో తిరుగులేని నేతగా ఎదిగిన మోడీ ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచానని చెప్పకుండా వరుసగా మూడోసారి ఎన్నికయ్యేందుకు ప్రయ త్నం చేస్తున్నారు.

2014లో ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ను 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చానని, 2027 నాటికి 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చబోతున్నానని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా 2047 నాటికి భారత్ అగ్రరాజ్యంగా మారే విధంగా, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు పరచనున్నట్లు కూడా ప్రకటిస్తున్నారు. మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు సైతం ప్రధానంగా ఆర్థిక అంశాలపై ఉండటం గమనార్హం. ద్రవ్యోల్భణం పెరిగిపోయిందని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి పోతున్నాయని, ప్రజల ఆదాయం పడిపోతుందని, ఆర్థిక తారతమ్యాలు పెరుగుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, అభివృద్ధిని వారు చూడలేక పోతున్నారంటూ ప్రధాని ఎదురు దాడికి దిగుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు నమ్మశక్యంగా లేవంటూ అనేక ఆధారాలు చూపడం విస్మయం కలిగిస్తోంది. ఆయన మోడీ ప్రభుత్వంలో 2014 నుండి సుమారు నాలుగేళ్లపాటు ప్రధాన ఆర్థిక సలహాదారునిగా పనిచేయడం గమనార్హం. అంటే మోడీ ప్రభుత్వం ఆర్ధిక విధానాలను తొలుత తీర్చిదిద్దిన వారిలో కీలకమైన వ్యక్తిగా చెప్పవచ్చు.

ఆయన ఒక సందర్భంగా మాట్లాడుతూ నేడు భారతదేశం చెప్పే గణాంకాలు అర్ధసత్యాలుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. అంటే ప్రభుత్వం అంకెల గారడీ ద్వారా ఆర్థికరంగంలో ఏదో సాధించామని ప్రచారం చేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా జిడిపి గణాంకాలు ఒక మిస్టరీగా ఉన్నట్లు సుబ్రమణియన్ తెలిపారు.తొలి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటును 7.8 శాతం నుంచి 8.2 శాతానికి, ద్వితీయ త్రైమాసికం వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 8.1 శాతానికి పెంచుతూ జాతీయ గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌వో) సవరించడం మాయాస్పదంగా ఉన్నట్లు విస్మయం వ్యక్తం చేశారు. మన దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్లు పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 3 శాతం మాత్రమే ఉన్న ట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఏడున్నర శాతం వృద్ధి చెందుతున్నట్లు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. కొద్దికాలం క్రితం గోల్డ్‌మన్ సాక్స్ విశ్లేషకుల విడుదల చేసిన నివేదిక సైతం భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళనలు వ్యక్తం చేసింది.

ముఖ్యంగా గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకు ల అసురక్షిత రుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ముందు ఎస్‌బిఐ దోషిగా నిలబడాల్సి రావడం గమనిస్తే వాటి పనితీరు పట్ల పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ ప్రభుత్వంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పన్ను రేట్లు పెరుగుతున్నట్లు ప్రధాని మోడీ నిత్యం చెబుతున్నారు. రక్షణ, రిటైల్, మీడియా రంగాలతో సహా పలు సున్నిత రంగాలలో సైతం విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్ల తెరిచారు. తాజాగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం కోసం స్వదేశీ ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా విదేశీ కంపెనీలకు సుంకాలలో భారీ రాయితీలు ప్రకటించారు. అయినప్పటికీ కూడా గత ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ పెట్టుబడులు క్షీణిస్తూ వస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమే. చైనా నుండి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఇతర దేశాలకు తరలిపోతున్న దశల్లో భారత్ ఆకర్షణీయమైన ప్రత్యామ్న్యాయం కాగలదని ఆశించాము.

అయితే, బంగ్లాదేశ్, థాయిలాండ్, వియాత్నం వంటి చిన్న దేశాలు ఈ విషయంలో భారత్ కు పోటీదారులుగా నిలబడటం విస్మయం కలిగిస్తోంది. మొదటి నుండి స్థిరమైన, పారదర్శకతతో కూడిన విధానాలు లేకపోవడమే భారత్‌లో పెట్టుబడులకు ప్రధాన సమస్యగా చాలాకాలంగా ఉంటూ వస్తోంది. రక్షణ పరంగానే కాకుండా ఆర్థికాభివృద్ధిలో సైతం నేడు భారత్ తో పాటు మొత్తం ప్రపంచానికి చైనా ఓ పెద్ద సవాల్ గా పరిణమించింది. రాబోవు 10 నుండి 20 ఏళ్లలో ప్రపంచ అవసరాలను గుర్తించి ముందుగానే సిద్దపడటంలో చైనా ప్రణాళికవేత్తలు సిద్దహస్తులు. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి)కు తయారీ గమ్యస్థానంగా భారత్‌ను ప్రోత్సహించేందుకు గాను కొత్త ఇవి పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ మాత్రమే కాకుండా, అమెరికా, ఇతర ఐరోపా దేశాలు సైతం ఇటువంటి విధానాలు రూపొందిస్తున్నాయి. అయితే, ఈ రంగంలో అవసరమైన ముడి వస్తువుల సరఫరాలో, ఖనిజాల విషయంలో నేడు ప్రపంచంలో చైనా ఆధిపత్యం వహిస్తున్నది. ప్రపంచానికి అవసరమైన లిథోనియమ్ నిల్వలలో సగంకు పైగా చైనా వద్దనే ఉన్నాయి.

నేడు మనం విస్తృతంగా ప్రచారం చేసుకొంటున్న 2070 నాటికి జీరో కాలుష్యం స్థాయికి చేరుకొంటామన్న లక్ష్యం విషయంలో చైనాపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. అటువంటి ముందుచూపు భారత్ ఆర్థిక ప్రణాళికలకు ఉండటం లేదు. ఎప్పటికప్పుడు సంక్షోభాల అదుపు పైననే దృష్టి సారిస్తున్నాము.హరిత విప్లవం తర్వాత భారత్ లో పుష్కలంగా ఆహారధాన్యాల నిల్వలు ఉంటున్నాయి.మనది వ్యవసాయ ఆధారమైన దేశం అయినప్పటికీ, ఇప్పటికి 60 శాతం మందికి పైగా ప్రజలు వ్యవసాయం, గ్రామీణ రంగాలపై ఆధార పడుతున్నప్పటికీ నిర్దుష్టమైన జాతీయ వ్యవసాయ విధానం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అమెరికాలో వ్యవసాయంపై 3-4 శాతం మంది ప్రజలు మాత్రమే ఆధార పడుతున్నా అక్కడి ప్రభుత్వం ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వ్యవసాయ విధానం రూపొందింస్తుంది. వాజపేయి హయంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న ‘నితీష్ కుమార్ అసమగ్రమైన జాతీయ వ్యవసాయ విధానం రూపొందించారు.

ఆ తర్వాత అటువంటి ప్రయత్నాలు జరగనే లేదు’. రైతుల ఆదాయం రెట్టింపు, కనీస మద్దతు ధరలు వంటి ఆకర్షణీయ మాటలు మాట్లాడుతున్నా ఎంతసేపటికి నగరాలలోని ప్రజలకు చౌకగా నిత్యావసర వస్తువులు అందించడమే ప్రభుత్వ విధానాలలో ప్రాధాన్య అంశంగా మారింది. ఉల్లిపాయల ధరలు రెండు నెలలపాటు కొంచెం పెరిగితే మొత్తం ప్రభుత్వ గందరగోళపడి ఎగుమతులపై ఆంక్షలు విధించి, దిగుమతులకు అనుమతులు ఇస్తూ రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంటడం చూసూనే ఉన్నాం. 2024 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన వృద్ధి అంచనా 7.6 శాతానికి బదులు వాస్తవ వృద్ధి రేటు 4.3 శాతం ఉంటుందని సుబ్రమణియన్ స్పష్టం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా భారత్ ప్రపంచంలోనే ఓ పెద్ద మార్కెట్ అని, అందుకనే అన్ని దేశాల నుండి పెట్టుబడులు ఇక్కడకు అనివార్యంగా తరలి వస్తాయనే అపోహల నుండి భారతీయులు బయటపడాలని ఆయన హితవు చెప్పారు. భారత్ జిడిపి 3 ట్రిలియన్ డాలర్లకుపైబడి ఉండగా, మధ్యతరగతి వర్గాల మార్కెట్ 750 బిలియన్ డాలర్లు మాత్రమేనని,

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 20-30 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని ఆయన చెప్పారు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తయారీ ఉత్పత్తుల వృద్ధి రేటు 15 శాతం లేకుండా, 7-8 శాతం వృద్ధిని ఏ దేశం సాధించలేదని ఆయన గుర్తు చేశారు. భారత్ సహహా 17 ఐరోపా దేశాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తి వ్యయంలో 80 నుండి 85 శాతం వరకు ప్రభుత్వాలే సబ్సిడీలు సమకూరుస్తాయి. ఒకొక్క ఎకరానికి రూ 55,000 మేరకు సబ్సిడీ అందుతుంది. అయినా వారికి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం నుండి ఎటువంటి ఆసరా లేకుండా మన రైతులు ఎదురీదుతూ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా దేశాన్ని నిలబెట్టింది వ్యవసాయరంగమే అని గుర్తించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News