Wednesday, January 15, 2025

నెహ్రూ టు మోడీ: ఆర్థిక విధానాలు

- Advertisement -
- Advertisement -

దేశంలో నేడు అమలు జరుగుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలకు నెహ్రూ ప్రభుత్వ కాలం నుండే పునాధులు ఉన్నాయి. దాని కొనసాగింపే సరళీకరణ ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత నెహ్రూ నాయకత్వాన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా సోవియట్ యూనియన్, చైనా దేశాలు సోషలిస్టు ఆర్ధిక విధానాలను అమలు జరిపి ఎంతో అభివృద్దిని సాధించటమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను పెంచాయి. ప్రపంచ ప్రజలు సోషలిస్టు ఆర్థిక విధానాలకు ఆకర్షితులైనారు. నెహ్రూ నాయకత్వాన ప్రభుత్వం సోషలిస్టు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు అమలు జరుపుతూ ఏ కూటమిలో చేరకుండా అలీన విధానం అమలు జరుపుతానని ప్రకటించి సామ్రాజ్యవాద, బడా భూస్వామ్య, బడా పెట్టుబడిదారుల అనుకూల విధానాల వైపు మొగ్గు చూపింది.

అది బయటపడకుండా సోషలిస్టు ముసుగు తగిలించు కోవటానికి సోవియట్ యూనియన్ తరహా పంచ వర్ష ప్రణాళిక ప్రకటించింది. 1951 పారిశ్రామిక నియంత్రణ చట్టం ప్రకారం ఉక్కు, మైనింగ్, యంత్ర పరికరాలు, నీరు, టెలి కమ్యూనకేషన్, బీమా, విద్యుత్ ప్లాంట్లు ప్రభుత్వ రంగంలోకి వచ్చాయి. ఇవి ప్రభుత్వ రంగంలోకి వచ్చినప్పటికీ సామ్రాజ్యవాదులకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మలచబడ్డాయి. బిలాయ్, బొకోరా ఉక్కు కర్మాగారాల్లో సామ్రాజ్యవాదులకు, టాటా, బిర్లా లాంటి బడా పెట్టుబడిదారులకు అవసరమైన ముడి ఉక్కును తయారు చేసి కారు చౌకగా అందించటం అందుకు నిదర్శనం. ఈ కర్మాగారాలను నిర్మించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. ఆ అవసరం లేకుండానే నెహ్రూ ప్రభుత్వ ఉక్కును వారికి అందిస్తున్నది.

1962లో చైనాతో యుద్ధం తర్వాత నెహ్రూ 1964-మే -27 మరణించారు. 1964 జూన్ 9 నుండి 1966 -జనవరి -11 వరకు లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నారు. నెహ్రూ,- లాల్ బహుదూర్ శాస్త్రి పాలనల కాలంలో చైనాతో యుద్ధం, తీవ్ర కరవు, బడ్జెట్ లోటు, వేగంగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ నుంచి ఆర్థిక సహాయం కోరింది. అందుకు ఈ రెండు సంస్థల విధించిన షరతుల ఫలితంగా పాలకులు సరళీకరణ ఆర్థిక విధానాల వైపు మళ్లడం, రూపాయి విలువ తగ్గించటం జరిగింది. ఎగుమతులను చౌకగా మార్చింది. ఒక పూట భోజనం మానుకోమని ప్రధాని శాస్త్రి ప్రజలకు పిలుపు ఇచ్చారు. వైట్ (పాల ఉత్పత్తి) విప్లవం పేరుతో అమూల్ మిల్క్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. శాస్త్రి 11-జనవరి -1966 మరణించారు.

ఆపద్ధర్మ ప్రధానిగా గర్జాలీ లాల్ నంద ప్రమాణం చేసిన అతి కొద్ది రోజుల తర్వాత 1966 జనవరి 24న ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఉన్న దిగుమతి సుంకాల, ఎగుమతి సబ్సిడీల వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వం అనుసరించిన విధానం వలన పారిశ్రామిక మాంద్యం, సరళీకరణ, దేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ ప్రమేయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన ఫలితంగా తిరిగి వాణిజ్య పరిమితులు విధించబడ్డాయి. 40% కంటే ఎక్కువ విదేశీ ఈక్విటీ భాగస్వామ్యంతో భారత దేశంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను పరిశీలించటానికి 1968 లో విదేశీ పెట్టుబడుల బోర్డు స్థాపిచబడింది.

ఇందిరా గాంధీ ప్రధాని అయిన తర్వాత విదేశీ పెట్టుబడులు, పరిశ్రమల్లో వాటి వాటాలు పెరిగాయి. 1978 నుండి వ్యవసాయ ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవటం ప్రారంభమైంది. భారత ఆర్థిక వ్యవస్థ తూర్పు, ఆగ్నేయాసియా పొరుగు దేశాల కంటే వెనకబడింది. ఇందిరా గాంధీ రష్యాపై ఎక్కువగా ఆధారపడుతూ అమెరికాతో బలమైన సంబంధాలు కొనసాగిస్తూ, ఆర్ధిక సహాయం కోరడమే కాకుండా భారత పరిశ్రమల్లోకి పెట్టుబడులు ఆహ్వానించారు. 1984 -అక్టోబర్ -31న ఇందిరా గాంధీ హత్యకు గురైనారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ 1984- అక్టోబర్ 31 ప్రధాని అయ్యారు. ఈ కాలంలోనే అమెరికా నాయకత్వాన సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారీ దేశాలు ప్రపంచ ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టి అన్ని దేశాలు వాటిని ఆచరణలో పెట్టాలని వత్తిడి చేశాయి. రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేయటం ప్రారంభించారు. అందు కోసం సరళీకృత ఆర్థిక విధానాలు ప్రతిపాదించారు. ఈ విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రైవేట్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు, పరిశ్రమల్లో విదేశీ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచారు. గ్రామీణ, గిరిజన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రాయితీలను ధనవంతుల అనుకూల విధానాలుగా ప్రజలు భావించారు. దిగుమతులకు పెద్దపీట వేశారు. 1991- మే -21న రాజీవ్ గాంధీ హత్యకు గురైనారు.

రాజీవ్ గాంధీ హత్య తర్వాత మూడు సంవత్సరాలు విపి సింగ్, చంద్రశేఖర్‌లు ప్రధానులుగా ఉన్నారు. 1991- జూన్ -21న పి వి నరసింహరావు ప్రధానిగా ఎన్నికైనారు. 1991లో ఆర్థిక సంక్షోభాన్ని నివారించే పేరుతో ఆర్థిక సంస్కరణలు చేయటం, విదేశీ పెట్టుబడులు తేచ్చే విధానాలు ప్రవేశపెట్టారు. అందుకు ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ, మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు పెంచటం, విదేశీ రుణాలను స్థిరీకరించేటప్పుడు విదేశీ వాణిజ్యానికి భారత దేశం ద్వారాలు చేయ టం, భారత దేశ మార్కెట్‌లను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు అనుమతించటం జరిగింది. వ్యవసాయ రంగాన్ని కూడా సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారీ దేశాల, బహుళ జాతి సంస్థల ఆధిపత్యానికి నిలయం చేసేందుకు డెంకల్ ప్రతిపాదలపై సంతకం చేయటం, వ్యవసాయ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది.

1996లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి విజయం సాధించి వాజ్‌పేయ్ ప్రధాని అయ్యారు. తిరిగి మార్చి 1999 మార్చి 19న మరోసారి ప్రధాని అయ్యారు. ఈయన కూడా పివి నరసింహరావు ఆర్ధిక సంస్కరణలనే అమలు జరిపారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలు చేపట్టారు. దేశ ఆర్థిక విధానాలను సమూలంగా మార్పు చేసే దిశగా స్వేచ్ఛా వాణిజ్యానికి సంస్కరణలను ప్రోత్సహించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో యుపిఎ కూటమి మెజారిటీ సాధించి నాటకీయంగా మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. ఈయన పాలనలో సరళీకరణ విధానాలు, ఆర్ధిక సంస్కరణలు వేగంగా జరిగాయి. అనేక ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరించటం లేదా అమ్మి వేయటం లేదా మూసివేయటం జరిగింది. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడుల వాటాలు బాగా పెరిగాయి. బహుళ జాతి సంస్థలకు ద్వారాలు బార్లా తెరవబడ్డాయి. వ్యవసాయ రంగం సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చబడింది.

2014, 2019 సాధారణ ఎన్నికల్లో బిజెపి నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ కూటమి మెజారిటీ సాధించి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. జాతీయత, జాతీయ విధానం జపం చేసిన బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టి సరళీకరణ, ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడుల జపం మొదలు పెట్టింది. రక్షణ రంగంతో సహా ప్రభుత్వ రంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులకు అనుమతించింది. కొన్నింటిలో నూటికి నూరు శాతం అవకాశం కల్పించింది. ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను అమ్మకానికి పెడుతున్నది. వ్యవసాయ రంగా న్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధానాలు ప్రవేశపెట్టే విధంగా మూడు వ్యవసాయ చట్టాలను చేసింది. బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం కార్మిక హక్కులను హరించే చట్టాలు కూడా చేసింది. దేశానికి ‘స్వాతంత్య్రం’ వచ్చిన దగ్గర నుండి ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, సరళీకరణ విధానాలు అమలు జరపడం, ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టడం, సామ్రాజ్యవాదుల, బడాపెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలను కాపాడే విధానాలు అమలు జరుపుతూ వచ్చాయి. మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాల కన్నా అత్యంత వేగం గా వీటిని అమలు చేస్తున్నది. దేశ ప్రజల ప్రయోజనాలకు ప్రమాదకరమైన విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే నేడు ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News