Saturday, December 21, 2024

అమెరికా రుణం ప్రపంచ వ్రణం

- Advertisement -
- Advertisement -

అమెరికాకు అభివృద్ధి చెందిన సంపన్న దేశమని పేరు. ఈ సంపదలో విదేశాల ప్రత్యక్ష, పరోక్ష సహకారం చాలా ఉంది. స్వదేశాల్లో కోట్ల ఖర్చు తో చదువుకొన్న విద్యావంతులు ఉన్నత చదువులకుపోయి అమెరికాకు కోట్లు చెల్లిస్తారు. డాలర్ మారక విలువ పెరగడంతో ఆ విద్యార్థులపై ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. స్వదేశాల్లో ఉపాధి లేమి, పెరిగిన డాలర్ విలువ, మెరుగైన అమెరికా సామాజిక సౌకర్యాల కారణాలతో ఆ విద్యార్థులు ఉన్నత చదువుల తర్వాత అమెరికాలోనే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని అక్కడే నిలబడతారు. ఆ దేశ పౌరులుగా స్థిరపడతారు. అమెరికాకు పెట్టుబడి అవసరం లేని, తులనాత్మకంగా తక్కువ జీతాలకు పని చేసే, తయారీ మానవ వనరులుగా మారుతారు. స్థానిక రాజకీయాలు, కార్మిక సంఘాల నిరసన ఉద్యమాల్లో తలదూర్చకుండా పొదుపుగా జీవిస్తూ డబ్బు మిగిల్చి అమెరికా ఆర్థిక వ్యవస్థను బలపరుస్తారు. తమ బంధుమిత్రుల అవసరార్థ పర్యటనలతో అమెరికాకు ఆదాయం కల్పిస్తారు. అయినా అమెరికా అన్ని దేశాల నుండి అప్పులు తీసుకుంది. ఇండియా లాంటి దేశాలు ఈ ఉన్నత చదువుల మేధావులకు ఉపాధి అవకాశాలు కల్పించదు.

కొంత కాలం ఉద్యోగం చేసిన తర్వాత లేదా చదువుల అప్పులు తీరిన తర్వాత స్వదేశానికి తిరిగి రావాలని నియమాలు విధించదు. ప్రధాని, నా పాలనలో ఉపాధులు పెంచాను. మేధావులను సవ్యంగా ఉపయోగించుకునే పథకాలు రచించాను. మీకు ఉద్యోగాలకు కొదవ లేదు. ఇండియాకు వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కండి అనరు. కోడి ఏ దొడ్లో మేసినా నా పెరట్లో గుడ్లు పెడితే చాలన్నట్లు, ఇండియాకు ఆర్థిక సాయం చేయండి.మా పార్టీకి నిధులు ఇవండి. మీ బంధు మిత్రులతో నాకు ఓట్లు వేయించండి అంటారు. సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేవి. చదువు పూర్తి కాగానే స్వదేశాలకు పోయి తమ దేశాల అభివృద్ధికి పాటు పడాలన్న నియమం విధించాయి.అధిక వడ్డీ రేట్లతో అమెరికా రుణ భారం పెరుగుతూనే ఉంది. అమెరికా ఆర్థిక స్థిరత్వ కొనసాగింపు కష్టతరంగా మారుతోంది. అమెరికా ఖజానా శాఖ ఇటీవల ఖజానా అంతర్జాతీయ పెట్టుబడి నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం విదేశీ పెట్టుబడిదార్ల వద్ద ఉన్న అమెరికా ఆర్థిక ఒప్పంద పత్రాల (బాండ్ల) మొత్తం 2023 అక్టోబర్‌లో 3,900 కోట్ల డాలర్లు తగ్గి 7.56 లక్షల కోట్ల డాలర్లకు దిగింది. ఈ తగ్గుదల ఆగస్టు నుండి కొనసాగుతోంది.

ఈ ఆర్థిక పతన వివరాలు రెండు నెలల నుండి మార్కెట్ తీరును ప్రతిబింబించినప్పటికీ, అమెరికా ఖజానా మార్కెట్‌లో బాండ్లు ఎక్కువగానే జారీ అవుతున్నాయని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గలేదు, పెరుగుతున్నాయి. అందువలన కార్పొరేట్ సంస్థలు ఎగవేతదారులుగా మారే ప్రమాదం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి 2023 అక్టోబర్‌లో హెచ్చరించింది. ఆర్థిక వృద్ధి ఊపు లేకపోవడం, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ప్రభుత్వ లోటు నిష్పత్తి కారణంగా అమెరికాకు అప్పుల అవసరం పెరిగింది. ఫలితంగా అప్పుల సేకరణ, రుణ పత్రాల జారీలను ఆపడం దానికి కష్టతరమైంది. దాని జాతీయ రుణాలు రోజురోజుకూ పెరగడానికి ఈ పరిస్థితులే కారణం. అదే సమయంలో, సమాఖ్య సంక్షేమ మూలనిధి (ఫెడరల్ రిజర్వ్) 11 సార్లు వడ్డీ రేటును పెంచింది. దానితో అమెరికా సమాఖ్య వడ్డీ రేటు 5.25% నుండి 5.5 శాతానికి పెరిగింది. దీంతో బ్యాంకులు, పెన్షన్ సంస్థలు, ఇతర సంస్థాగత పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక అమెరికా బాండ్ల నిర్వహణ తక్కువ లాభదాయకంగా మారింది. 2023 ఆర్థిక సంవత్సరానికి అమెరికా బడ్జెట్ లోటు 1.70 లక్షల కోట్ల డాలర్లు. అంటే ఏడాదికి 32 వేల కోట్ల డాలర్లు లేదా 23 శాతం పెరిగింది. ఆర్థిక లోటు, బాండ్ల జారీ, వడ్డీ చెల్లింపులు, మరింత పెద్ద ఆర్థిక లోటు అనే విష వలయంలోకి అమెరికా పీకల లోతుకు కూరుకుపోయిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ వాణిజ్య పరిష్కారం, కేంద్ర బ్యాంకుల విదేశీ మారక నిల్వలు, ప్రపంచ రుణ మదింపు, ప్రపంచ మూలధన ప్రవాహాలలో అమెరికా డాలర్ ఇప్పటికీ ఆధిపత్య స్థానాన్ని ఆక్రమించింది. అయితే అమెరికా ప్రభుత్వం డాలర్ స్థిరస్థితిని దుర్వినియోగం చేస్తోంది.డాలర్ పలుకుబడిని స్వప్రయోజనాలకు ఎక్కువగా వాడుకుంటోంది. అమెరికా దుష్ప్రవర్తన ప్రపంచ దేశాల్లో అమెరికా పట్ల అపనమ్మకాన్ని పెంచింది. ప్రత్యామ్నాయ అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను వెతుక్కునే స్థితికి వాటిని నెట్టింది. కొంతమంది విదేశీ పెట్టుబడిదారులు ప్రధానంగా జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఫ్రాన్స్ వంటి అమెరికా మిత్ర దేశాలు ఈ ఏడాది అమెరికా ఖజానాతో లావాదేవీలను పెంచుకున్నప్పటికీ ఎక్కువ దేశాలు అమెరికా ఖజానాలో తమ ఆర్థిక పెట్టుబళ్ళను తగ్గించుకుంటూనే ఉన్నాయి.అమెరికా ఖజానా కార్యదర్శి జానెట్ యెల్లెన్, సమాఖ్య ప్రభుత్వం తన అప్పుల చెల్లింపులో విఫలమైతే అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని 2023 జనవరి మొదట్లోనే హెచ్చరించారు. ఆ సమయంలో అమెరికా అప్పు 31.4 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో అది 33.94 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 29 డిసెంబర్ 2023 నాటికి 34 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.

అమెరికా అప్పులున్న మొదటి 5 దేశాలు: జపాన్ 1,09,820 కోట్ల డాలర్లు (మొత్తం అప్పులో 14.52%), చైనా 76,960 కోట్ల డాలర్లు (మొత్తం అప్పులో 10.17%), ఇంగ్లండ్ 69,300 కోట్ల డాలర్లు (మొత్తం అప్పులో 9.16%),లక్జెంబర్గ్ 34,540 కోట్ల డాలర్లు (మొత్తం అప్పులో 4.57%), కేమన్ ద్వీపాలు 32,380 కోట్ల డాలర్లు (మొత్తం అప్పులో 4.28%). అమెరికా ఆర్థిక వ్యవస్థ నియమాల ప్రకారం అది ఏ దేశం నుండి అయినా అప్పు తీసుకోవచ్చు. అంటే రుణ పత్రాలు అమ్మవచ్చు. అందుకే తన వాణిజ్య, సాంకేతిక, ఉత్పత్తి రంగాల శత్రువైన చైనా నుండి కూడా అప్పు తీసుకుంది. అమెరికా మన దేశానికి కూడా 21,600 కోట్ల డాలర్ల అప్పు ఉంది. ఈ రుణ విస్తరణ రేటు అమెరికాతో పాటు, ఇతర ప్రపంచాన్ని భారీ ప్రమాదంలో పడేస్తోంది. ప్రపంచ వాణిజ్య పోటీలో పెట్టుబడిదారి తత్వంతో నడుస్తున్నా కమ్యూనిస్టుల పాలనలోని చైనా, సోవియట్ యూనియన్ సోషలిస్టు పంథాను సంతరించుకోని పూర్వ పోలీసు అధికారి పాలనలో కొనసాగుతున్న రష్యా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని అరికట్టడంలో అవి మరింత క్రియాశీలకంగా పని చేయాలి. పూర్వ సమసమాజ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, భారత్ ఈ చర్యల్లో సహకరించాలి. అమెరికా డాలర్ ఆధిపత్య పతనంతోనే ప్రపంచ ప్రగతి సాధ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News