Thursday, January 23, 2025

‘లిక్కర్’ కుదుపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ విచారణల క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించింది. కేసు ఛార్జీషీట్‌లో ఢిల్లీ ఎక్సైజ్‌కమిషనర్ రాహుల్ సింగ్ పేరును ప్రస్తావించే బదులు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ పేరు పెట్టింది. ఇడి తాజా అభియోగపత్రంలో ఎంపి సంజయ్ సింగ్ పేరును చేర్చడంపై సర్వత్రా ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం అయింది. తన పేరును ఛార్జీషీటులో పెట్టి, ఇప్పుడు తప్పయిందని, టైప్ పొరపాటు అని ఇడి వర్గాలు బుకాయిస్తున్నాయని పేర్కొన్న సంజయ్ సింగ్ ఈ విషయంలో ఇడిని కోర్టుకు ఈడుస్తానని, పరువు నష్టం దావా వేస్తానని, ముద్దాయిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచాలకుడిని చేరుస్తానని బుధవారం వెల్లడించారు. దీనితో దేశవ్యాప్తంగా వివిధ కేసులకు సంబంధించి ఇడి వర్గాలు చేపడుతున్న దర్యాప్తు తంతు ప్రహసనంగా మారింది. తన ప్రతిష్టకు భంగం వాటిల్లే రీతిలో వ్యవహరించిన ఇడి చీఫ్‌పై ఆయన తదుపరి స్థానంలో ఉండే సహాయక డైరెక్టర్‌ను విచారించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఆప్ ఎంపి సంజయ్‌సింగ్ ఇప్పుడు కేంద్ర ఆర్థిక కార్యదర్శికి ఓ లేఖ పంపించారు.

ఇందులో పలు విషయాలను ప్రస్తావించారు. ఇడి ఉద్ధేశపూరితంగా తన పేరు ఇరికించిందని, బిజెపి ప్రోద్బలంతోనే , ఆమ్ ఆద్మీపార్టీ పరువు తీసేందుకు ఈ విధంగా ఛార్జీషీట్‌లో తన పేరు చేర్చిందని సంజయ్ ఈ లేఖలో రాశారు . ఈ నెల 20వ తేదీన కోర్టుకు ఇడి వర్గాలు ఓ అభ్యర్థన పంపించాయి. ఇందులో ఛార్జీషీట్ క్రమంలో పేర్లను టైప్ చేస్తున్నప్పుడు తప్పులు దొర్లాయని, రాహుల్ సింగ్ బదులు సంజయ్ సింగ్ అని వచ్చిందని, దీనిని సవరించి చూసుకోవల్సి ఉంటుందని ఈ దరఖాస్తులో కోరింది. ఈ క్రమంలో వెల్లడయిన ఇడి తప్పిదం ఇప్పుడు దేశవ్యాప్త దుమారానికి దారితీసింది. ప్రధాన మంత్రి కార్యాలయం ప్రోద్బలంతోనే తమ పార్టీ ఎంపి పేరు పెట్టారని ఆప్ ఆరోపించింది. ఇడి చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాకు , అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్‌కు సంజయ్ సింగ్ ఈ నెల 22న లీగల్ నోటీసు పంపించారు. వెంటనే వీరిద్దరూ చేసిన తప్పిదం లేదా ఉద్ధేశపూరిత చర్యకు బేషరతు క్షమాపణలు తెలియచేయాలి. లేదా కోర్టులో కలుసుకుందాం, తగు రీతిన జరిగే పరువు నష్టం దావా విచారణకు హాజరు కావల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై గత నెల 29న సంజయ్ సింగ్‌కు ఇడి నుంచి ఓ లేఖ అందింది.

అనుకోకుండా పేరు మారిందని తెలిపింది. అయితే అప్పటికే ఇడికి సంజయ్ నుంచి కోర్టు నోటీసు అందింది. అయితే తప్పిదం గురించి తాము నిజాయితీతో తెలియచేశామని, అయితే తమ వివరణకు ముందే సంజయ్ సింగ్ కావాలనే లీగల్ చర్యకు దిగుతున్నారని ఇడి వర్గాలు తెలియచేసుకుంటున్నాయి. అయితే ఇది తప్పిదమా లేక కావాలనే చేశారా, ఎంపి పేరు ఎందుకు చేర్చారు? అనే విషయాలు తేలాల్సి ఉందని, సంబంధిత అధికారులను ఐపిసి 1860 సెక్షన్ 500పరిధిలోని నిబంధనల మేరకు ప్రాసిక్యూట్ చేయాలని తాము కోరుతున్నట్లు ఆప్ తెలిపింది.

ఇదేం జోక్ , ఇదేం బూటకపు దర్యాప్తు

ఇడి వర్గాల వైఖరిని సంజయ్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. తప్పు దొర్లిందని వారే అంగీకరించారు, ఇది టైప్ దశలో క్లర్క్ స్థాయిలో చేసిన పొరపాటు అన్నారు. క్షమాపణ చెప్పాలనే తమ డిమాండ్‌కు బదులు తాపీగా సారీ చెప్పారని, ఇదేం జోక్? బూటకపు విచారణల క్రమంలో ఇంతటి దారుణమా అని ఇడిని ప్రశ్నించారు. జరగని లిక్కర్ స్కామ్‌పై బూటకపు దర్యాప్తు సాగిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మోడీ మూడ్‌కు అనుగుణంగా ఇడి నాట్యం ఆడుతోంది. ముందు తమ పార్టీ నేత సిసోడియాపై ఆధారాలు లేకుండానే చర్యకు దిగడం, జైలులోనెట్టడం, ఇప్పుడు తన పరువు తీయడం, ఇతరుల అరెస్టులు, సమన్లు వెలువరించడం, విచారణలకు పిలిపించి గంటల తరబడి వేధించడం ఇవన్నీ మోడీ చెప్పుడు మాటలతో సాగుతున్న చేష్టలు అని సంజయ్ సింగ్ విమర్శించారు. ఇదంతా కూడా ఆప్‌ను, ఆప్ నేత, సిఎం కేజ్రీవాల్‌ను దెబ్బతీసే కుట్రలో భాగంగా సాగుతోందని విమర్శించారు. తమ నేత కేజ్రీవాల్ తన శక్తి సామర్థాలకు తగ్గట్లుగా సత్ఫలితాలు సాధిస్తూ ఉంటే, పార్టీ ఖ్యాతి ఎల్లలు దాటుతూ ఉంటే బిజెపికి సహించడం లేదన్నారు. బిజెపి కేజ్రీవాల్, సింగ్‌పై ఎదురుదాడికి దిగింది. వీరు దుష్ప్రచారానికి దిగుతూ అసత్యాలు వల్లిస్తున్నారని ఆరోపించింది. దుష్ప్రచారానికి దిగడం ఆప్ నిజరూపాన్ని చూపుతుందన్నారు.

బిజెపి వారి మదిలో విపక్ష నేతల పేర్లే ఉన్నాయా?

సంజయ్ సింగ్ పేరును ఇడి చేర్చడం బిజెపి, కేంద్రంలోని పెద్దల ఆలోచనా ధోరణిని తెలియచేస్తుందని విలేకరుల సమావేశంలో ఢిల్లీ కేబినెట్ మంత్రి, ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. రాహుల్ సింగ్ బదులు సంజయ్ సింగ్ పేరు దొర్లిందని అంటున్నారని, మరి ఈ పేరు బదులు బిజెపి ఎంపిలు పర్వీష్ వర్మ లేదా మనోజ్ తివారీల పేర్లు పొరపాటున అయినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే బిజెపి వారి ఆలోచనల్లో నడిచే సంస్థలకు తరచూ కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్ పేర్లే వస్తాయ అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News