ముఖ్యమంత్రి చన్నీ మేనల్లుడు అరెస్ట్
చండీగఢ్: ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇడి, సిబిఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులు సాధారణమైపోయాయి. ఈ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇడి దూకుడు కొనసాగిస్తున్నది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద ముఖ్యమంత్రి చన్నీ మేనల్లుడిని అరెస్టు చేసింది. ఎనిమిది గంటల విచారించిన తర్వాత గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వైద్య పరీక్షల తర్వాత మొహాలీ కోర్టులో హాజరు చెప్పారు. చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీపై ఇసుక అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గత నెల 18న భూపిందర్ సింగ్ ఇంటితో మరో పదిచోట్ల దాడులు నిర్వహించింది. ఇందులో భూపిందర్ ఇంట్లో రూ.7.9 కోట్లు, అతడి సహచరుడు సందీప్ కుమార్, కుద్రదీప్ సింగ్ ఇండ్లలో రూ.2 కోట్లు సీజ్ చేసింది. ఈ ముగ్గురు ప్రొవైడర్స్ ఓవర్సీస్ సర్వీసెసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని ఇడి గుర్తించింది. దీంతో వారిపై అక్రమ మైనింగ్ వ్యవహరంలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.