కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభృతులకు సంబంధం ఉన్న ముడా అనుసంధానిత మనీ లాండరింగ్ కేసులో దాదాపు రూ. 300 కోట్లు విలువ చేసే 140 పైగా స్థిరాస్తుల యూనిట్లను తాను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం వెల్లడించింది. మైసూరు పట్టణ అభివృద్ధి సంస్థ (ముడా) స్థలం కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణకు సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగమే ఆ ఆస్తుల జప్తు. సదరు ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు, ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వివిధ వ్యక్తుల పేర్ల మీద నమోదై ఉన్నాయని ఫెడరల్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ‘ముడా సేకరించిన 3 ఎకరాల 16 గుంటలకు బదులు తన భార్య బిఎం పార్వతి పేరిట 14 స్థలాలకు పరిహారం పొందేందుకు సిద్ధరామయ్య (ఒక కాంగ్రెస్ నేత) తన రాజకీయ పలుకుబడి ఉపయోగించారని ఆరోపించడమైంది.
ఆ స్థలాన్ని అసలు ముడా రూ. 324 700కు సమీకరించింది. సంపన్న ప్రాంతంలో 14 స్థలా రూపంలో పరిహారం విలువ రూ. 56 కోట్లు’ అని ఇడి తెలిపింది. ఈ కేసులో కర్నాటక లోకాయుక్త ప్రశ్నించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను గాని, తన కుటుంబం గాని ఎటువంటి తప్పూ చేయలేదని పదే పదే స్పష్టం చేశారు. ప్రతిపక్షానిక తాను అంటే ‘భయం’ అని, అవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు అని ఆయన పేర్కొన్నారు. పార్వతికి పరిహార స్థలాలను అక్రమంగా కేటాయించడంలో ముడా మాజీ కమిషనర్ డిబి నటేష్ పాత్ర ‘కీలకమైనది’గా తెలియవచ్చిందని ఇడి పేర్కొన్నది. పార్వతికి కేటాయించిన 14 స్థలాలు కాకుండా ఇతర స్థలాలు పెక్కింటిని రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు పరిహారంగా ‘అక్రమంగా’ ముడా కేటాయించిందని, వారు వాటిని ‘భారీ’ లాభానికి విక్రయించ ‘లెక్కలో చూపని’ అధిక నగదు మొత్తాన్ని సంపాదించారని ఇడి ఆరోపించింది.