పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన సన్నిహిత సీనియర్ మంత్రి పార్థ చటర్జీని మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి తొలగించి ఒక మంచి పని చేశారు. పార్థ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలలో అవినీతికి పాల్పడి అక్రమంగా ఆర్జించినదని భావిస్తున్న రూ. 50 కోట్లు, ఐదు కెజిల బంగారం ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ అపార్టుమెంట్లలో ఇడికి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పట్టుబడింది. మొదట ఒక అపార్టుమెంటులో రూ. 20 కోట్ల కట్టలు బయటపడగానే పార్థ చటర్జీని, అర్పిత ముఖర్జీని ఇడి అరెస్టు చేసింది. మొదట్లో దీనిని కేవలం తనపై బురద చల్లడానికి పన్నిన కుట్రగా భావించిన మమత బెనర్జీ కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాని పార్థ అవినీతి దుర్గంధం అదే పనిగా ముక్కులను అదరగొడుతూ ఉంటే ఆమెపై ఒత్తిడి పెరిగి తీవ్ర చర్య తీసుకోక తప్పలేదు.
ఇడి కచ్చితమైన సమాచారంతో పకడ్బందీగా జరిపిన దాడిని అంగీకరించడం మినహా వేరే మార్గం లేకపోయింది. ఇరకాటంలో పడిన మంత్రి తనతో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించగా ఆమె ఆ ఫోన్లను కూడా తీసుకోలేదు. అయితే ఈ ఉదంతాన్ని పురస్కరించుకొని తనను ఇబ్బంది పెట్టదలచుకొంటే సహించబోనని మమత స్పష్టం చేశారు. ఇడి ఒక సివిల్ కోర్టు వంటిదని, దానికి సర్వాధికారాలున్నాయని సుప్రీంకోర్టు మొన్న బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. తగిన కారణాలు చూపకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్) సమర్పించకుండా ఇడి దాడులకు, సోదాలకు, అరెస్టులకు పాల్పడడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నిటినీ కొట్టి వేసింది. దీనితో ఇడికి అపరిమితమైన అధికారాలు చేజిక్కాయి. ఇసిఐఆర్ ఇవ్వకుండానే అనుమానితులపై అన్ని రకాలుగా విరుచుకుపడే అధికారాలు ఇడికి ఉన్నాయని, మనీలాండరింగ్ (అక్రమార్జిత అవినీతి సొమ్మును చట్టబద్ధం చేసుకొనే) నిరోధక చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీం ధర్మాసనం క్లీన్ చిట్ ఇచ్చింది.
అవినీతి నిరోధంలో సంబంధిత సంస్థలకు విశేషాధికారాలు కట్టబెట్టవచ్చుగాని, వాటిని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం, ముఖ్యంగా పాలకులు స్వప్రయోజనాలకు వాడుకోకుండా తగు కట్టుదిట్టాలు చేయవలసిన ఆగత్యం వున్నది. అందుకే పార్థ చటర్జీ కేసు నిజానిజాలు త్వరగా తేల్చాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు. కేంద్ర పాలకుల అదుపులోని జాగిలాల్లా ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు పని చేయడం ప్రారంభించి చాలా కాలమైంది. సిబిఐని పంజరంలోని చిలుకగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అది కేంద్రంలో అధికారంలోకి ఎవరొస్తే వారి పలుకులు పలుకుతుంది. వారు చెప్పినట్టు నడుస్తుంది. ఇందులో ఇప్పుడు ఇడి మిగతా కేంద్ర దర్యాప్తు సంస్థలను మించి పోయింది. అది దాడులు చేసిన కేసుల సంఖ్య బారెడు, శిక్షలు పడినవి వేలెడుగా వుంటున్నాయి. ఈ విషయం లోక్‌సభకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో నే వెల్లడైంది.
గత ఎనిమిదేళ్లలో 3010 సోదాలు జరిపి రూ. 99356 కోట్ల ఆస్తులు జప్తు చేయగా, కేవలం 23 కేసుల్లోనే శిక్షలు పడినట్టు సమాచారం. దాడులు, సోదాలు జరిపిన కేసుల్లో తగిన ఆధారాలు సేకరించి లోపరహితంగా ఛార్జ్ షీట్‌లు దాఖలు చేయడంలో ఇడి, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి. దానితో ప్రతిపక్ష నేతలపై మసిపూసి రాజకీయంగా లబ్ధి పొందే క్రమంలో కేంద్ర పాలకులకు ఉపయోగపడడానికే పరిమితమవుతున్నాయి. దేశాధికారం చేజిక్కించుకొన్నాక బిజెపి ఇడిని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద కు, రాజకీయ ప్రయోజనాల వేటకు, ఎన్నికల వంటి కీలక సమావేశాల్లోనే ప్రయోగిస్తున్నది. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో లొంగ దీసుకోడానికి శివసేన ఎంపి సంజయ్ రౌత్‌పై ఇడిని ప్రయోగించిన ఉదంతం ఇందుకు తాజా నిదర్శనం. గతంలో కర్ణాటకలో కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల నివాసాల్లో ఇడి దాడులు జరిగాయి.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో అందరూ కడిగిన ముత్యాలని అనుకోవాలా? మహారాష్ట్ర తర్వాత పశ్చిమ బెంగాల్‌పై కేంద్ర పాలకుల దుష్ట దృష్టి పడిందంటున్నారు. 38 మంది తృణమూల్ ఎంఎల్‌ఎలు బిజెపి అగ్ర నాయకత్వంతో మాట్లాడుతున్నారని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరిన సినీ ప్రముఖుడు మిధున్ చక్రవర్తి మొన్ననే ప్రకటించారు. అయితే బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్‌కు విశేష బలముంది. 294 మంది సభ్యులు గల శాసనసభలో తృణమూల్‌కు 216 మంది బలం ఉండగా, బిజెపి బలం 75 మాత్రమే. అయితే ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందలేని చోట అక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని అడ్డదారిలో కూల్చేసి అధికారాన్ని చేజిక్కించుకొనే కళను బిజెపి నానాటికీ మరింతగా రక్తికట్టిస్తున్నది. పార్ధ చటర్జీ మీద దాడిలో మమత ప్రభుత్వ నైతిక మూలాలు ఛేదించి దానిని కూల్చివేసే కుట్ర ఇమిడి ఉన్నదా?