Friday, November 15, 2024

టాలీవుడ్ డ్రగ్స్ కేసు సినీ నటీనటులకు ఇడి క్లీన్‌చిట్…!

- Advertisement -
- Advertisement -

ED Cleanchit To Tollywood Celebrities

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్‌పై విచారించిన ఇడి అధికారులకు ఏలాంటి ఆధారాలు లభించకపోవడంతో సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ లభించింది. విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతులతో పాటు నిధులు మళ్లింపుపై టాలీవుడ్‌కు చెందిన 12 మంది సినీ నటీనటులను సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. ఈక్రమంలో విచారణలో మనీలాండరింగ్‌కు సంబంధించి సరైన ఆధారాలు లభించకపోవడంతో ఇడి ఈ కేసు మూసివేత నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌తో పాటు ఫెమా, హవాలా సంబంధించిన అంశాలపై ఇడి లోతుగా దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. ఇదిలావుండగా 2017లో ఆబ్కారీ శాఖ నమోదు చేసిన కేసులతో టాలీవుడ్ మత్తు మందుల వ్యవహారం తొలుత తెరపైకి వచ్చింది. సుదీర్ఘంగా దాదాపు మూడేళ్లపాటు జరిగిన ఈ దర్యాప్తులోనూ ఏలాంటి ఆధారాలేవీ లభించలేదు.

తాజాగా ఇడి అధికారులు సైతం ఈ కేసులో అప్రూవర్‌గా మారిన కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టారు. కాగా 2017 జులైలో డ్రగ్స్ సరఫరా కేసులో ఎక్సైజ్ అధికారులు కెల్విన్ మార్కెరాన్స్‌ను అరెస్టు చేసి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి తాను మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందిని పిలిచి విచారించి, వారి వాంగ్మూలం నమోదు చేశారు. మత్తు మందులు వాడేదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరిలో కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపడంతోపాటు సాక్ష్యులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినప్పటికీ మత్తు మందుల వాడకానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలూ లభించకపోవడంతో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చారు.

అయితే ఈ కేసులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఇడి అధికారులు ఈ ఏడాది ఆగస్టు నెలలో డ్రగ్స్ దిగుమతితోపాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోపాటు రవితేజ, రాణా, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖులను విచారించి వారి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12మంది సినీ ప్రముఖులను విడతల వారీగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు విచారించారు. ఈ కేసులో ఇడి అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపినప్పటికీ మత్తు మందుల దిగుమతి, వాడకం, నిధుల మళ్లింపు వంటి అంశాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించకపోవడంతో ఈ కేసు మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్, ఎక్సైజ్, తాజాగా ఇడి అధికారులు వేర్వేరుగా దర్యాప్తు జరిపినప్పటికీ ఏలాంటి ఆధారాలు సేకరించలేకపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News