Sunday, December 22, 2024

ఇడికి ఉద్వాసన!

- Advertisement -
- Advertisement -

ఈ నెలాఖరున (జులై 31) తప్పుకోవలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాను సుప్రీంకోర్టు ఆదేశించడం ఒక మంచి పరిణామం. వాస్తవానికి ఆయన పదవీకాలం ఈ నవంబర్‌తో ముగిసిపోవలసి వుండగా, నాలుగు మాసాల ముందే ఆయనను సుప్రీంకోర్టు సాగనంపుతున్నది. అదే సమయంలో ఇడి, సిబిఐ డైరెక్టర్ల పదవులలోని వారికి ఏడాదికి ఒకసారి వంతున మూడు విడతల్లో మూడు సంవత్సరాల పాటు పొడిగింపు ఇవ్వడానికి అవకాశం కల్పించిన చట్ట సవరణలను అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది. ఇది పాము చావకుండా, కర్ర విరగకుండా చేస్తున్న తీర్పుగా భావించడానికి ఆస్కారం కలిగిస్తున్నదనడాన్ని ఆక్షేపించలేము.

ఇడి డైరెక్టర్‌గా మిశ్రాను పొడిగిస్తూ పోవడంతో కేంద్ర పాలకుల స్వార్థం వున్నదని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పాలకులపై పగబట్టి దాడులు చేయించడంలో బాగా ఉపయోగపడతాడనే కారణంపైనే ఆయనను కొనసాగిస్తూ వచ్చారనే విమర్శ వున్న సంగతి తెలిసిందే. ఇడి, సిబిఐ డైరెక్టర్ల పదవుల్లో రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తారు. ఆ విధంగా ఎస్‌కె మిశ్రా 2018 నవంబర్‌లో నియమితులయ్యారు. రెండేళ్ళు పూర్తి అయిన తర్వాత ఆయనను మరి ఏడాది కాలం పొడిగించారు. దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరెంత మాత్రం పొడిగించడానికి వీలు లేదని 2021లో తీర్పు వెలువడింది. దానిని కేంద్రం గౌరవించలేదు. ఇడి డైరెక్టర్ నియామకానికి అవకాశం కల్పిస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషన్ చట్టానికి, సిబిఐ డైరెక్టర్ పదవిలో నియమించడానికి వీలు కల్పిస్తున్న ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి, ఫండమెంటల్ రూల్స్‌కు కేంద్ర ప్రభుత్వం 2021లో సవరణలు తీసుకు వచ్చింది. వీటి ప్రకారం ఈ పదవులలోని వారికి మూడు విడతలుగా మూడేళ్ళ పాటు పొడిగింపు ఇవ్వడానికి అవకాశం కలిగింది. అలా ఎస్‌కె మిశ్రాకు కేంద్రం వరుసగా మూడు పొడిగింపులు ఇస్తూ పోయింది.

జస్టిస్‌లు బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఎస్‌కె మిశ్రాకు 2021, 2022లో ఇచ్చిన పొడిగింపులు రెండూ చెల్లవని తీర్పు ఇచ్చింది. దీనితో ఆయన తక్షణమే ఆ పదవి నుంచి వైదొలగవలసి వున్నప్పటికీ ఆయన స్థానంలో కొత్త డైరెక్టర్ నియామకానికి తగిన వ్యవధి ఇవ్వడానికి, అంతర్జాతీయ ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ ఇండియాపై మదింపు చేస్తున్న సమయంలో ఉపయోగపడడం కోసం నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. అయితే ఎస్‌కె మిశ్రా పదవీ కాలం ఐదేళ్ళూ ముగిసిపోడానికి కేవలం నాలుగు మాసాల ముందు ఉద్వాసన పలకడం వల్ల కలుగుతున్న ప్రయోజనమంటూ వాస్తవానికి లేదనే చెప్పాలి. అందుకే ఈ తీర్పును ప్రధాని మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని నైతికార్థంలో మాత్రమే పరిగణించగలము. ఈ కేసులో సుప్రీంకోర్టు తరపున సహాయకుడుగా పని చేసిన ఆ కోర్టు ప్రస్తుత న్యాయమూర్తి కెవి విశ్వనాథన్ కేంద్రం తీసుకొచ్చిన సవరణలను రద్దు చేయవలసిందిగా న్యాయస్థానాన్ని అర్థించారు.

ఏడాదికి ఒకసారి వంతున మూడేళ్ళ పాటు పొడిగింపు ఇవ్వడానికి గల అవకాశాన్ని చూపి ఈ పదవుల్లోని వారి చేత కేంద్రం తన ప్రయోజనాలకు ఊడిగం చేయించుకొనే అవకాశం వుందని, అందుచేత అటువంటి పొడిగింపులకు వీలు కల్పిస్తున్న చట్ట సవరణలను రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతటి బాధ్యతాయుతమైన పదవుల్లోని వారు కేంద్ర పాలకుల ఒత్తిడికి లొంగిపోడం చట్టానికి, జాతి హితానికి హాని కలిగిస్తుందనడం ఎంత మాత్రం ఖండించదగినది కాదు. పలానా వారిపై దాడులు, సోదాలు చేయాలని కేంద్రం ఆదేశిస్తే అది సమంజసం కాదనిపించినపుడు ఆ ఆదేశాలను తిరస్కరించే స్వేచ్ఛ ఇడి, సిబిఐ డైరెక్టర్లకు వుండి తీరాలి. ఏడాదికి ఒకసారి ఏడాది పాటు పొడిగింపు ఇవ్వడమనేది ఖచ్చితంగా ఈ పదవుల్లోని వారిని కేంద్రం చెప్పుచేతల్లో వుంచుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వొత్తిడికి అతీతంగా వుంచడమనే సూత్రానికి ఈ సవరణలు పూర్తి విరుద్ధమని ఈ కేసు పిటిషనర్లు కూడా అభిప్రాయపడ్డారు. కాని ధర్మాసనం వారితో ఏకీభవించలేదు.

ఈ పొడిగింపులు కేంద్రం ఇష్టావిలాసంగా ఇవ్వడానికి వీల్లేదని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, కమిషనర్లు కలిసి సిఫారసు చేస్తేనే ఇడి డైరెక్టర్‌కు ఒక ఏడాది పొడిగింపు లభిస్తుందని, ఇడి, సిబిఐ డైరెక్టర్లను నియమించేటప్పుడు సిఫారసు చేసే కమిటీలే వారికి ఏటేటా మూడు సార్లు పొడిగింపు ఇవ్వాలని సిఫారసు చేయవలసి వస్తుందని, అలాగే 2021లో ఈ చట్టాలకు, ఫండమెంటల్ రూల్స్‌కు తెచ్చిన సవరణలను పార్లమెంటు ఆమోదించిందనే కారణాలు చూపి జస్టిస్ గవాయ్ వాటిని రద్దు చేయడానికి నిరాకరించారు. ఈ కమిటీల్లో వున్నవారు కేంద్రం ఒత్తిడికి అతీతులు కారుకదా! అలాగే పార్లమెంటు చేసిన చట్టాలను రాజ్యాంగ హితం గీటురాయి మీద పెట్టి సుప్రీంకోర్టు రద్దు చేసిన సందర్భాలు లేకపోలేదు. అయినా జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ సవరణలను రద్దు చేసే విషయంలో వెనుకాడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News