న్యూఢిల్లీ : కాశ్మీర్‌లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసు సందర్భంగా తాను మనీ లాండరింగ్ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం వెల్లడించింది. ఆ ఫిర్యాదులో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కొందరి పేర్లను చేర్చినట్లు ఇడి తెలియజేసింది. చార్జిషీట్‌లో పేర్లు నమోడైన నిందితులలో ముదసిర్ అహ్మద్ షేఖ్, ముస్తాఖ్ అహ్మద్ కాంబే, మహమ్మద్ ఇక్బాల్ ఖాన్ ఉన్నారు.
కోర్టు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని విచారణ ప్రారంభించేందుకు నిందితులకు నోటీస్ జారీ చేసినట్లు ఇడి ఒక ప్రకటనలో తెలియజేసింది. ముదసిర్ అహ్మద్ షేఖ్, ముస్తాఖ్ అహ్మద్ కాంబే, మహమ్మద్ ఇక్బాల్ ఖాన్, మహమ్మద్ అబ్బాస్ షేఖ్, తౌసీఫ్ అహ్మద్ షేఖ్‌లపై 2015 జూలై నాటి సమ్ము కాశ్మీర్ పోలీస్ (కుల్గామ్) ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి మనీ లాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఐపిసి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భద్రత దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అబ్బాస్ షేఖ్, తౌసీఫ్ అహ్మద్ షేఖ్ మరణించారు.