Saturday, January 25, 2025

లాలూ కుటుంబ సభ్యుల పేర్లతో తొలి ఛార్జిషీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్‌జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన “భూమికి ఉద్యోగం కుంభకోణం” తో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ తొలి ఛార్జిషీట్‌ను ఢిల్లీ లోని ప్రత్యేక పీఎఎల్‌ఎ కోర్టులో సమర్పించింది. ఇందులో లాలూ సతీమణి, బీహార్ మాజీ సిఎం రబ్రీదేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్, లాలూ కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగి , లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానంద్‌లతోపాటు , ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్‌పోర్ట్‌లపేర్లు చేర్చి అభియోగాలు మోపింది.

నిందితులను ప్రాసిక్యూట్ చేయాలని, అంతకు ముందు అటాచ్ చేసిన ఆస్తులను జప్తు చేయాలని ఈడీ కోర్టును కోరింది. జనవరి 16న ఈ కేసు విచారణకు రానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గత ఏడాది మార్చిలో ఢిల్లీ,బీహార్,ముంబైలలో మొత్తం 25 చోట్ల సోదాలు చేపట్టింది. తేజస్వి నివాసంతోపాటు లాలూ కుమార్తెలు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిపింది.

రూ. 6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగినట్టు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. లాలూ కుటుంబ సన్నిహితుడు కత్యాల్‌ను గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. వాంగ్మూలం నమోదుకు హాజరు కావాలని లాలూకు సమన్లు పంపినా ఇంకా విచారించలేదు. ఆయన కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ఒకసారి హాజరు కాగా, మరోసారి విచారణకు రావాలని ఇటీవల నోటీసులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News