న్యూఢిల్లీ: మహదేవ్ యాప్‌తో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో తాజాగా దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు దుబాయ్‌కు చెందిన ఒక హవాలా ఆపరేటర్‌కు సంబంధించిన రూ.580 కోట్లకు పైగా సెక్యూరిటీ హోల్డింగులను స్తంభింపచేయడంతోపాటు రూ.5.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. కోల్‌కత, గురుగ్రామ్, ఢిలీ, ఇండోర్, ముంబై, రాయచూర్‌లోని వివిధ ్రప్రదేశాలలో ఫిబ్రవరి 28న దాడులు మొదలయ్యాయని వారు చెప్పారు.
మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌కుసంబంధించి దర్యాప్తు జరుపుతున్న ఇడికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులకు సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. ఈ కేసులో హరిశంకర్ టిబ్రేవాల్ అనే హవాలా ఆపరేటర్‌ను ఇడి గుర్తించిందని వర్గాలు తెలిపాయి. కోల్‌కతాకు చెందిన టిబ్రేవాల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నాడని వారు చెప్పారు. టిబ్రేవాల్‌కు చెందిన రూ.580.78 కోట్ల విలువైన సెక్యూరిటీ హాల్డోంగులను ఇడి స్తంభింపచేసినట్లు వారు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని ఇడి అరెస్టు చేసింది.