మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నిధులను స్తంభింపజేశారు
న్యూఢిల్లీ: చైనీస్ నియంత్రణలో ఉన్న లోన్ యాప్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ టోకెన్‌లపై ఈ వారం దాడులు జరిపిన తర్వాత చెల్లింపు గేట్‌వేలు ఈజ్ బజ్,రేజర్ పే, క్యాష్ ఫ్రీ , పేటిఎంలలో ఉన్న రూ.46.67 కోట్ల నిధులను స్తంభింపజేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) శుక్రవారం తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నిధులను స్తంభింపజేశారు. ఢిల్లీ, ముంబై, ఘజియాబాద్, లక్నో , గయాలోని నిందితుల బహుళ ప్రాంగణాల్లో సెప్టెంబర్ 14న సోదాలు ప్రారంభించారు.
హెచ్ పిజెడ్ అనే యాప్ ఆధారిత టోకెన్, సంబంధిత సంస్థలకు సంబంధించిన పరిశోధనకు సంబంధించి ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్, జైపూర్, జోధ్‌పూర్ , బెంగళూరులోని 16 బ్యాంకులు ,చెల్లింపు గేట్‌వేలు కూడా కవర్ చేయబడ్డాయి.
“పేమెంట్ అగ్రిగేటర్‌ల ద్వారా వర్చువల్ ఖాతాలలో భారీ నిల్వలు నిర్వహించబడుతున్నట్లు కనుగొనబడింది, పూణేలోని ఈజ్‌బజ్ ప్రైవేట్ లిమిటెడ్ లో రూ. 33.36 కోట్లు, బెంగళూరులోని రేజర్‌పే సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో రూ. 8.21 కోట్లు, బెంగళూరులోని క్యాష్ ఫ్రీ పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో రూ.1.28 కోట్లు, న్యూఢిల్లీలోని పేటిఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌తో రూ. 1.11 కోట్లు కనుగొన్నాం’’ అని పేర్కొంది. వివిధ బ్యాంకు ఖాతాలు, వర్చువల్ ఖాతాల్లో రూ.46.67 కోట్లు గుర్తించి స్తంభింపజేసినట్లు ఈడి తెలిపింది.