మన తెలంగాణ/హైదరాబాద్ : రెండో రోజు తాండూరు ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి ఇడి విచారణ ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి దాదాపు 8 గంటల పాటు రోహిత్‌రెడ్డిని ఇడి అధికారులు విచారించారు. రోహిత్‌రెడ్డి సమర్పించిన ఆధారాలపై ఇడి అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంఎల్‌ఎ వ్యక్తిగత, వ్యాపార వివరాలపై ఆరా తీశారు. రోహిత్‌రెడ్డికి చెందిన ఎవరెస్టు ఇన్‌ఫ్రా కంపెనీ వివరాలు, కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలు, కంపెనీ లావాదేవీలపై వివరాలు సేకరించారు. 17 బ్యాంకు ఖాతాలు, మూడు లాకర్ల వివరాలను రోహిత్‌రెడ్డి ఇడి అధికారులకు సమర్పించగా, అనుమానాస్పద లావాదేవీలపై రోహిత్‌రెడ్డిని ప్రశ్నించారు.
అయితే మంగళవారం ఉదయమే ఇంటి నుండి బయలుదేరిన రోహిత్ రెడ్డి మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇడి విచారణకు హాజరయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందున పూజ, భిక్ష కార్యక్రమం తర్వాత విచారణకు హాజరౌతానని ఇడి అధికారులకు పైలెట్ రోహిత్ రెడ్డి సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం తన ఇంట్లో నుండి బయటకు వచ్చిన పైలెట్ రోహిత్ రెడ్డి తన చార్టెడ్ అకౌంటెంట్‌తో చర్చించారు. ఇడి అధికారులు అడిగిన సమా చారానికి సంబంధించిన డాక్యుమెంట్లను పైలెట్ రోహిత్ రెడ్డి తీసుకు వచ్చారు. కాగా, సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఇడి విచారణకు హాజరయ్యారు. సోమవారం ఆరు గంటల పాటు ఆయనను ఇడి అధికారులు విచారించారు.