అప్రూవర్‌గా మారిన నిందితుడు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్తకోణం
12 సార్లు కెల్విన్‌ను విచారించిన ఇడి
మనతెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్తట్విస్టు చోటుచేసుకుంది. డ్రగ్ సరఫరా కేసులో కీలక నిందితుడు కెల్విన్‌ను 12 సార్లు ప్రశ్నించిన ఇడి అధికారులు అతని అకౌంట్లలో సినీ తారలు నగదు జమచేసినట్లు గుర్తించారు. దీంతో డ్రగ్స్ కేసులో గతంలో విచారణకు హాజరైన సినీతారలకు ఇడి అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఇడి అధికారుల విచారణ అనంతరం డ్రగ్స్ కేసులోని పాత్రధారి, సూత్రధారి కెల్విన్ అప్రూవర్‌గా మారారు. ఈక్రమంలో బాలీవుడ్ కేసులో కూడా కెల్విన్‌కు లింకులు ఉన్నట్లు తేలింది. గతంలో ఎక్సైజ్ పోలీసుల విచారణలో కెల్విన్ ఎలాంటి విషయాలూ వెల్లడించలేదు. అయితే కెల్విన్‌కు సంబంధించిన అకౌంట్లలోకి సినీ తారలు భారీగా డబ్బులు జమ చేసినట్లు తెలడంతో సినీ తారల బ్యాంక్ అకౌంట్లను ఇడి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.కెల్విన్ అప్రూవర్‌గా మారడంతోనే డ్రగ్స్ కేసులో టాలీవుడ్లో కొందరి ప్రముఖుల కూసాలు కదిలే పరిస్థితి వచ్చింది. ఈక్రమంలో డ్రగ్స్ కేసులో జరిగిన లావాదేవీలను పరిశీలించిన ఇడి అధికారులు ఈ కేసులోని ప్రధాన నిందితుడు కెల్విన్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. డ్రగ్స్ దందా, వినియోగంపై కెల్విన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రస్తుతం ఒక్కొక్కరినీ ఇడి ప్రశ్నించేందుకు రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కెల్విన్‌తో ప్రత్యక్ష,పరోక్ష సంబంధాలున్న వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో పాటు వాటిని ఫ్రీజ్ చేసేందుకు ఇడి సమాయత్తమౌతోంది.