Saturday, November 23, 2024

సెల్ ఫోన్ల ధ్వంసంపై ‘ఇడి’వి కట్టుకథలే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మూడో సారి ఇడి విచారణ ముగిసింది. బుధవారం విచారణ ఉండబోదని, మళ్లీ ఎప్పుడు అనేది తెలియపరుస్తామని ఇడి అధికారులు చెప్పారని కవిత లీగల్ టీమ్ వివరించింది. మంగళవారం దాదాపు పది గంటల పాటు ఆమెను ఇడి అధికారులు విచారించారు. అయితే సాయంత్రం ఇడి ఆఫీస్ నుంచి కవిత న్యాయవాది సోమా భరత్‌కు పిలుపు రావడంతో ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. భరత్‌తో పాటు బిఆర్‌ఎస్ నేత దేవి ప్రసాద్ కూడా వున్నారు.

ఈ సందర్భంగా ఇడి అడిగిన సమాచారాన్ని సోమా భరత్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇడి కార్యాలయం వద్దకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనంతరం మంగళవారం రాత్రి 9.44 గంటలకు కవిత ఇడి కార్యాలయంలోని గేట్ నెం 3 నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తలకు, మీడియాకు అభివాదం చేస్తూ కారులో ముందుకు సాగారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కవిత ఇడి ఆఫీసుకు విచారణ కోసం వచ్చారు. మంగళవారం ప్రధానంగా మొబైల్ ఫోన్లపై ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. కవిత, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పేర్లున్న అందరి ఫోన్లు, కాల్ డేటాను ఇదివరకే ఇడి సేకరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎవరెవరు ఎన్ని ఫోన్లు వాడారు..? అనేదానిపై ఐఎంఈఐ నంబర్లతో సహా ఇడి వివరాలు బయటపెట్టింది. దీంతో మంగళవారం ఆ ఫోన్లనే అధికారులకు అంద జేయాలని కవితను సోమవారం ఇడి అధికారులు ఆదేశించారు. దీంతో కవిత ఆ పది ఫోన్లను ఇడికి సమర్పించారు.

కాగా సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడినట్లు, ధ్వంసం కూడా చేసినట్లు ఇడి అభియోగం ఉంది. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఇడి అభియోగాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఇడి స్పష్టంగా తెలిపింది. అందుకే ఇడి అభియోగం మేరకు కవిత 10 ఫోన్లను మంగళవారం అధికారులకు ఇచ్చేశారు. మంగళవారం ఉదయం 11.00 గంటలకే ఢిల్లీలోని సిఎం కెసిఆర్ నివాసం నుంచి కవిత ఇడి కార్యాలయానికి వెళ్లారు. మొదట నివాసం దగ్గర ప్రెస్‌మీట్ ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో రద్దయ్యింది. నివాసం దగ్గర మీడియాకు ఇడి అడిగిన మొబైల్ ఫోన్లను కవిత చూపించారు. ఆ తర్వాత ఇడి కార్యాలయం దగ్గర కూడా మరోసారి మీడియాకు కవర్‌లో ఉన్న ఫోన్లను కవిత చూపించారు. ఆ తర్వాత మొదటి అరగంటపాటు వివరాలు నమోదు, సంతకాలు తీసుకున్నాక ఇడి అధికారుల ఎదుట కవిత హాజరయ్యారు. 11.30 గంటల నుంచి సాయంత్రం 9.30 గంటలు దాటినా కవిత బయటికి రాకపోవడంతో హస్తిన వేదికగా హైటెన్షన్ నెలకొంది. చివరికి 9.30 గంటల ప్రాంతంలో కవిత బయటికి రావడంతో బిఆర్‌ఎస్ క్యాడర్ హ్యాపీగా ఫీలయ్యింది.

ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకొని అనుచిత లబ్ధి పొందేందుకు సౌత్‌గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించారని ఇండో స్పిరిట్ సంస్థ 192 కోట్ల ప్రయోజనం పొందిందన్న ఆరోపణలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో కవితకు బినామీగా వ్యవహరించారనే ఆరోపణతో అరుణ్ రామచంద్రపిళ్లైను అరెస్ట్ చేసి 14 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. తర్వాత ఎంఎల్‌సి కవితను ఈ నెల 11న తొలిసారి 8 గంటల పాటు, సోమవారం 10 గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఇడి తనకు జారీచేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్, ఆ కేసులో తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరుతూ ఇడి దాఖలు చేసిన కెవియట్‌లు ఈ నెల 24న విచారణకు రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News