Friday, November 15, 2024

‘ఛీ’కోటి కోణాలు!

- Advertisement -
- Advertisement -

‘చీకోటి’ చీకటి రాజ్యం
మనీలాండరింగ్‌పై ఇడి నోటీసులు
సోమవారం హాజరుకావాలని ఆదేశాలు
ప్రజా ప్రతినిధులతో సంబంధాలపై ఆరా..!
సినీ నటులతో ప్రమోషన్ వీడియోలపై విచారణ
ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖలు
మనతెలంగాణ/హైదరాబాద్: విదేశాలలో క్యాసినో నిర్వహిస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాల మేరకు క్యాసినో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు గురువారం విచారించిన ఇడి అధికారులు తిరిగి సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిల ఇళ్లతో పాటు కడ్తల్‌లోని ఫాం హౌస్‌లో ఇడి సోదాలు ముగిసిన అనంతరం చీకోటి ప్రవీణ్‌ను ఇడి విచారించి నోటీసులు ఇచ్చారు. ఇడి తనికీలలో టాలీవుడ్,బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు బాబాలతో చీకోటి ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఇడి అధికారులు గుర్తించారు. క్యాసినోకు రావాలంటూ ప్రమోషన్ నిమిత్తం 10 మంది సినీ తారలను నేపాల్‌కు తరలించి వారితో చేయించిన వీడియోలను ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో క్యాసినో ప్రమోషన్ వీడియోలతో నటించిన అమీషా పాటేల్ ,మేఘననాయుడు, విల్సన్, గోవింద, ముమైత్‌ఖాన్, మల్లికాషెరావత్, సింగర్ జాన్సీరాజులకు చెల్లించిన కోట్లాది రూపాయలపై ఇడి విచారణ చేపడుతోంది. అదేవిధంగా రెండు నెలల కిందట నేపాల్ క్యాసినోకు 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైయ్యారని, ప్రమోషన్లకు సంబంధించి క్యాసినో నిర్వాహకుల నుంచి సినీ తారలకు అందిన పేమెంట్ ఇతర ఆర్థిక లావాదేవీలపై ఇడి ఆరా తీస్తున్నట్లు సమాచారం.
హవాల నిధులతో కదిలిన డొంక ః
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పెద్ద మొత్తంలో క్యాసినో గెలుచుకోగా ఆయా మొత్తాలు హవాలా మార్గంలో స్వదేశానికి రప్పించినట్లు ఇడికి సమాచారం అందింది. దీంతో క్యాసినో నిర్వహకులు, ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలపై ఇడి నిఘా సారించింది. ఇడి విచారణలో గోవా, నేపాల్, థాయ్‌లాండ్‌లలో నిర్వహించే క్యాసినోకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 200 మంది కస్టమర్లను చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు ప్రత్యేక టూర్లతో తరలిస్తున్నట్లు ఇడి అధికారుల విచారణలో తేలింది. ఈక్రమంలో కస్టమర్లకు సంబంధించి రానుపోను ఖర్చులతో కలిపి 5 రోజుల పాటు విదేశాల్లో ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు ఇడి విచారణలో తేలింది. గతంలో ఎక్కువ మంది కస్టమర్లను శ్రీలంక తీసుకెళ్లేవారని, ఇటీవల కాలంలో అక్కడ సంక్షోభం కారణంగా నేపాల్‌కు తరలిస్తున్నారని ఇడి అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కస్టమర్ల పర్యటనలతో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఇడిఅధికారులు అనుమానిస్తున్నారు.ఇందులో భాగంగా ఇడి సోదాలలో క్యాసినో ఆడటానికి ఉపయోగించే టోకెన్‌లు పెద్ద మొత్తంలో దొరికినట్లు తెలియవచ్చింది.
ఇడి ప్రశ్నలకు సమాధానమిచ్చా ః చీకోటి ప్రవీణ్
క్యాసినో వ్యవహారంలో ఇడి అధికారులు గురువారం చికోటి ప్రవీణ్‌ను విచారించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యాసినో నేపాల్‌లో చట్టబద్దంగా జరుగుతోందని, తాను న్యాయబద్దంగానే వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. క్యాసినో వ్యవహారంలోనే ఇడి దాడులు చేసిందని, ఈక్రమంలో ఇడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు. తిరిగి సోమవారం విచారణకు రమ్మన్నారని, విచారణకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చీకోటి ప్రవీణ్ తెలిపాడు.
ప్రజా ప్రతినిధులతో లింకులు ః
క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్‌కు తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ నేతలతో లింకులున్నట్లు ఇడి అధికారులు గుర్తించారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులతో ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఇడి ఆరా తీస్తోంది. ఇడి సోదాలలో ప్రవీణ్ సెల్‌ఫోన్, లాప్‌టాప్‌లో ఇటీవల నేపాల్‌కు వెళ్లిన కస్టమర్లలో జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులు ఉన్నట్లు ఇడి అధికారులు గుర్తించారు. అలాగే చెన్నైకి చెందిన ఓ బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చికోటి వ్యవహరిస్తున్నట్లు ఇడి అధికారులు అనుమానిస్తున్నారు.
గతంలో నగరంలోనూ ః
క్యాసినో నిందితుడు చికోటి ప్రవీణ్ గతంలో హైదరాబాద్లో పేకాట క్లబ్ నిర్వహించినట్లు ఇడి అధికారుల విచారణలో వెలుగుచూసింది. నగరంలోని బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్,బంజారాహిల్స్‌లలో సెలబ్రిటీల కోసం రహస్యంగా క్యాసినో దందాను నిర్వహించినట్లు తేలింది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పేకాట క్లబ్‌లపై నిషేధం విధించడంతో గోవాలో గో డాడీ క్యాసినోలో చీకోటి ప్రవీణ్ పార్టనర్‌గా మారినట్లు విచారణలో తేలింది. తమ వ్యాపారం పెంచుకునేందుకు సెలబ్రిటీలకు భారీగా డబ్బులిచ్చి దందా నిర్వహిస్తున్నట్లు ఇడి కీల క ఆధారాలు సేకరించింది. కాగా క్యాసినో ఆడే వారి నుంచి ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని కస్టమర్లను ప్రత్యేక విమానంలో కోల్‌కతా మీదుగా నేపాల్‌కు తరలించారని, ఒక్కో విమానానికి రూ. 50 లక్షలు, ఒక్కో హోటల్‌కు రూ.40 లక్షలు చెల్లిస్తున్నట్లు ఇడి విచారణలో వెలుగుచూసింది. ఒక్కో కస్టమర్ల నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారని, వీరికి తెలుగు రాష్ట్రాలలో సుమారు 200 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు ఇడి అధికారులు గుర్తించారు.
చీకోటి పుట్టిన రోజు వేడుకలు ః
క్యాసినో కేసులో కీలక నిందితుడు చీకోటి ప్రవీణ్ తన జన్మదిన వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించినట్లు ఇడి గుర్తించింది. గత నెలలో నగరంలోని చంపాపేటలోని ఓ గార్డెన్‌లో జరిగిన వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు పోలీస్, ఎక్సైజ్ అధికారులతో పాటు ఆధ్యాత్నిక బాబాలు హాజరయ్యారు. ఇతర నగరాల నుంచి పలువురు ప్రముఖులు ఛార్టర్డ్ విమానాల్లో ఇక్కడికి తరలించినట్లు ఇడి అధికారులు ఆధారాలు సేకరించారు. తన పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన వారికి ఖరీదైన బహుమతులు ఇచ్చేవారని, ఆయా బహుమతులు కొనుగోలు చేసిన బిల్లులను ఇడి అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. తాజాగా ఇడి దాడుల గురించి తెలియడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, అధికారులు ఆందోళనతో వణికిపోతున్నట్లు సమాచారం. క్యాసినో నిందితులు చీకోటి, మాధవరెడ్డిలతో టాలీవుడ్,బాలీవుడ్‌కు చెందిన సినీ తారలతో ఉన్న పరిచయాలపై ఇడి ఆరా తీస్తోంది. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా క్యాసినో వీడియోలను ప్రవీణ్ ప్రచారం చేసినట్లు తేల్చిన ఇడి ఈ ఏడాది జనవరిలో ఎపిలోని గుడివాడ గ్యాంబ్లింగ్‌లోనూ చీకోటి ప్రవీణ్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
ఎవరెవరికి ఎంత ః
క్యాసినో ప్రమోషన్‌లో నటించిన మల్లికా శెరావత్‌కు రూ. కోటి, ఈషా రెబ్బకు రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్ ఖాన్కు రూ.15 లక్షలు, అమీషా పటేల్‌కు రూ.80 లక్షలు, హయాతికి రూ.40 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు చొప్పున చీకోటి ప్రవీణ్ చెల్లించినట్టు ఇడి దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పారితోషకం అందుకున్న తారలకు ఇడి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.
‘చీకోటి’ నేర చరిత్రపై ఆరా..!
నగరంలోని సైదాబాద్‌లోని వినయ్‌నగర కాలనీకి చెందిన చీకోటి ప్రవీణ్ నేర చరిత్రపై ఇడి ఆరా తీస్తోంది. గతంలో ఒక సినీప్రముఖుడిని కిడ్నాప్ చేశాడనన్న ఆరోపణలపై విచారణ చేపడుతున్నారు. గత ఇరవై ఏళ్ల క్రితం చిన్న సిరామిక్టైల్స్ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్ కాలక్రమంలో సినీ నిర్మాతగా మారి విలన్‌గా నటించాడు. సినీ వ్యాపారంలో నష్టాలు చవిచూసిన చీకోటి వనస్థలిపురంలో ఒక వైద్యుడిని కిడ్నాప్ చేసి జైలుకు వెళ్లొచ్చాడని ఇడి విచారణలో వెలుగుచూసింది. చీకోటి వ్యాపారంలో రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులతో సంబంధాలున్నట్లు ఇడి అనుమానిస్తోంది.ఇటీవల కాలంలో ప్రముఖ స్వామీజీని చీకోటి ప్రవీణ్ ఒక కారులో తీసుకెళ్తున్న దృశ్యాలకు సంబంధించిన ఫుటేజీని ఇడి స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతోంది.
స్టిక్కర్ నాదే.. నాకేం సంబంధం ః మంత్రి మల్లారెడ్డి
క్యాసినో వ్యవహారంలోని నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లో ఇడి అధికారుల సోదాల్లో దొరికిన కారు స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన స్టిక్కర్ తనదే అని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఆ స్టిక్కర్ మార్చి 2022 నాటిదని పేర్కొన్నారు. దాన్ని మూడు నెలల క్రితమే తీసేసి బయట పడేశామని, అది ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధమని మంత్రి మల్లారెడ్డి తేల్చిచెప్పారు. ఆ స్టిక్కర్ నాదేనని మీడియా ద్వారానే తెలిసిందని, నేను మూడు నెలల కిందనే పడేశానని, అది ఎవరైనా తీసి పెట్టుకుంటే నాకేం సబంధం ఉంటుందన్నారు.

ED Investigation to Chikoti Praveen

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News