Monday, January 20, 2025

గ్రానైట్ కంపెనీలకు ఇడి షాక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు గ్రానైట్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఆయా గ్రానైట్ కంపెనీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని సిబిఐకి ఇడి లేఖ రాసింది. ఈ మేరకు పలు కంపెనీల పేర్లను కూడా సిబిఐకి తెలిపింది. ఫలితంగా గ్రానైట్ వ్యవహారాల అంశం మరో టర్న్ తీసుకునే అవకాశం ఉంది. అంతకు ముందు ఇడి అధికారులు రాష్ట్రంలోని గ్రానైట్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి పలువురిని విచారించారు. కాగా, సిబిఐకి ఇడి తెలిపిన పేర్లలో రాష్ట్రంలోని శ్వేత ఏజెన్సీ, జేఎం బాక్సీ, మైధిలి ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, అరవింద గ్రానైట్స్ , ఎఎస్‌యూవై షిప్పింగ్, పిఎస్సార్ ఏజెన్సీస్, షాండియా ఏజెన్సీస్, కె.వి.ఎ ఎనర్జీ , శ్రీవెంకటేశ్వరా గ్రానైట్స్ , గాయత్రి మైన్స్ ఉన్నాయి. వీటిపై విచారణ జరిపించాలని సిబిఐకి ఇడి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి రూ.800 కోట్లకు పైగా పన్ను చెల్లించలేదని అభియోగాలపై విచారించాలని లేఖలో ప్రస్తావించింది.

దొంగ లెక్కలతో, తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టిన కంపెనీలపై విచారించాలని తెలిపింది. అయితే ఫలితంగా మరోసారి గ్రానైట్ కంపెనీల వ్యవహారం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇడి అధికారులు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌కు సంబంధించిన గ్రానైట్ కంపెనీలపై, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిచంద్రకి సంబంధించిన గాయత్రి గ్రానైట్స్‌పై దాడులు చేశారు. అనేక కీలక విషయాలను సేకరించారు. ఇదిలా ఉండగా, గ్రానైట్ కంపెనీల్లో సోదాలకు సంబంధించి ఇప్పటికే ఇడి పలు వివరాలను వెల్లడించింది. హవాలా రూపంలో పెద్ద మొత్తం లో లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించామని తెలిపింది. చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై కూడా ఆరా తీసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా ఎగ్గొట్టి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇడి తాజాగా సిబిఐకి లేఖ రాయటంతో అసలేం జరగబోతుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News