Thursday, January 23, 2025

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు మరోసారి ఇడి లేఖ

- Advertisement -
- Advertisement -

ED letter to Excise Department in drugs case

మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసు పూర్తి వివరాల కోసం ఎక్సైజ్‌కు ఇడి అధికారులు శుక్రవారం నాడు మరోసారి లేఖ రాశారు. డ్రగ్స్ కేసులోని నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులు కావాలని ఇడి కోరింది. ఈక్రమంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు, కీలక డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఇటీవల ఇడి అధికారులు హైకోర్టుకు తెలిపారు. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఇడికి అప్పగించాలని హైకోర్టు సైతం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్‌కు మరోసారి ఇడి లేఖ రాసింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇడి అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. టాలీవుడ్‌కు చెందిన 12 మందిని విడివిడిగా ఇడి అధికారులు ప్రశ్నించడంతో పాటు వాళ్ల బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలను ఎన్నిసార్లు అడిగినా రాష్ట్రప్రభుత్వం సహకరించడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హైకోర్టుకు ఫిర్యాదుచేయడంతో ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు చెందిన పూర్తివివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దర్యాప్తు సంస్థలు సమర్పించిన పత్రాలను ఇడికి ఇవ్వాలని స్థానిక కోర్టులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇడి అధికారులు అబ్కారీ అధికారులకు మరోసారి లేఖ రాశారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆధారాలను బట్టి ఇడి అధికారులు మరోసారి కొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలావుండగా టిపిసిసి చీఫ్ రేవంత్ ఈ కేసును ఇడి, సిబిఐ, ఎన్‌సిబి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న డ్రగ్స్ కేసులను రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సమర్థంగా విచారణ జరపడం లేదని.. కేంద్ర సంస్థలకు అప్పగించాలని రేవంత్ తరఫున న్యాయవాది రచనారెడ్డి కోరారు. తమకు అవసరమైన దస్త్రాలు, సమర్పించేలా ఎక్సైజ్ శాఖను ఆదేశించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ఆన్‌లైన్ విచారణలో నేరుగా కోర్టుకు వివరించారు. తాము అడిగిన వివరాలను ఎక్సైజ్ శాఖ ఇవ్వడం లేదని కోర్టు నుంచి తీసుకోవాలని చెబుతోందని ఇడి జెడి తెలిపారు.

మరోవైపు తాము కోరుతున్న దస్త్రాలు లేవనిదర్యాప్తు అధికారులు సమర్పించలేదని విచారణ కోర్టులు చెబుతున్నాయని అభిషేక్ గోయల్ వివరించారు. ఈ క్రమంలో ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారి కాల్ డేటా సహా అన్ని వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. తమ ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. దర్యాప్తునకు అవసరమైన వివరాలు, దస్త్రాలు ఇవ్వకపోతే మళ్లీ తమను సంప్రదించవచ్చునని ఇడికి హైకోర్టు సూచించింది. ఇడి దర్యాప్తు కొనసాగుతున్నందున ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు కేసును అప్పగించాల్సిన అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి పిల్‌పై విచారణను ముగించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News