న్యూఢిల్లీ: మధుమేహం వ్యాధితో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ అవసరం. అయితే ఆయనకు ఇన్సూలిన్ అవసరమా, కాదా అన్న విషయంలో ఎయిమ్స్ స్పెషలిస్టులను సంప్రదించామని ఈడి కోర్టుకు అబద్ధాలు చెప్పిందని ఢిల్లీ కేబినెట్ మంత్రి ఆతిషి సోమవారం ఆరోపించారు.
ఇదిలావుండగా కేజ్రీవాల్ జైలులో ప్రతిరోజు 15 నిమిషాలు డాక్టరును సంప్రదించడానికి, ఇన్సూలిన్ తీసుకోడానికి అనుమతి కోరుతూ శుక్రవారం తాజా వినతిని సమర్పించారు.
ఢిల్లీ మంత్రి ఆతిషి విలేకరుల సమావేశంలో ‘ఎయిమ్స్ స్పెషలిస్టులను సంప్రదించామని, వారు ఇన్సూలిన్ అవసరం లేదన్నారని, పైగా కేజ్రీవాల్ కు ఓ డైట్ ఛార్ట్ ను కూడా రూపొందించారని ఈడి కోర్టుకు అబద్ధమాడింది. పైగా ఆ డైట్ ఛార్ట్ ను డయబెటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ రూపొందించలేదు. డైటీషియన్లు ఎంబిబిఎస్ డాక్టర్లు కాదని మనకు తెలుసు. డైట్ ఛార్ట్ ప్రకారం వారు కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ అవసరం లేదని కోర్టుకు తెలిపారు’ అని వివరించారు.
ఇదిలావుండగా తిహార్ అడ్మినిస్ట్రేషన్ శనివారం ఎయిమ్స్ స్పెషలిస్టులతో కేజ్రీవాల్ కు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని, అప్పుడు కేజ్రీవాల్ ఇన్సూలిన్ అంశాన్ని లేవనెత్తడం కానీ, లేక డాక్టర్లు ఇన్సూలిన్ ను పురమాయించడ కానీ జరగలేదని జైలు అధికారులు తెలిపారు.