Tuesday, November 5, 2024

నవదీప్, విక్రమ్‌లను ప్రశ్నించిన ఇడి

- Advertisement -
- Advertisement -

ED questioning Navdeep and Vikram

డ్రగ్స్ కేసులో ఎనిమిది గంటల పాటు విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్ కేసులో సినీనటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జిఎం విక్రమ్‌లను సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇడి అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈక్రమంలో 9 గంటల పాటు నవదీప్, విక్రమ్‌ల బ్యాంకు ఖాతాలను మనీ లాండరింగ్ కోణంలో పరిశీలించిన అధికారులు వారి అకౌంట్ల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. ముఖ్యంగా నవదీప్, డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌ల మధ్య లావాదేవీలు జరిగాయా అనే కోణంలో పరిశీలించారు. అదేవిధంగా ఎఫ్ క్లబ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగిందనే ఆరోపణలపై ఇడి అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. ఎఫ్‌క్లబ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు పరిశీలించడంతో పాటు అందులో అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీలకు సంబంధించి వివరాలను క్లబ్ జిఎం విక్రమ్‌ను అడిగి తెలుసుకుంటున్నారు.

కాగా నవదీప్, విక్రమ్‌లు ఇడి కార్యాలయానికి చేరుకోగానే ఇడి అధికారులు కెల్విన్‌ను పిలిపించి మరోసారి విచారించారు. విచారణలో ఇడి అధికారులు సంధించిన చాలా ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు దటవేసినట్టు తెలుస్తోంది. ఎఫ్ క్లబ్ లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై నవదీప్ నోరు మెదపలేదని సమాచారం. మేనేజర్ చెప్పే విషయాలకు నవదీప్ చెప్పే విషయాలకు పొంతన లేకపోవడంతో దాదాపు ఐదు గంటల పాటు ఇద్దరిని కలిపి ఒకే గదిలో విచారించారు. ఎఫ్ క్లబ్ ద్వారా విదేశీయులకు వెళ్లిన లావాదేవీల పైనే ప్రధానంగా ఇడి అరా తీసినట్టు తెలుస్తోంది. తన పబ్ కు విదేశీ కస్టమర్ లు రావడం వల్ల జరిగిన లావాదేవీలుగా నవదీప్ చెప్పుకొచ్చినట్టు సమాచారం. ఇక, ఎఫ్ క్లబ్ మేనేజర్ మాత్రం తనకు ఏమి తెలియదని నవదీప్ చెప్పిన ప్రకారం ఆయన చెప్పిన వ్యక్తులకు డబ్బులు పంపించానని. ఎవరికి, ఎందుకో, ఎంత పంపానో సమాచారం తెలియదని మేనేజర్ ఇడి ముందు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇడి అధికారులు ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, రానా, నందు, రవితేజను విచారించారు. ఈ కేసులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, డ్రగ్స్ సరఫరాదారులు కెల్విన్, వాహిద్‌లు ఇచ్చిన సమాచారం మేరకు నటుడు నవదీప్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు.

విక్రమ్‌పై ప్రశ్నల వర్షం 

ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు తరచూ హాజరయ్యే సెలబ్రిటీలెవరు? అక్కడ జరిగే పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేస్తారా? అనే అంశాలపై జిఎం విక్రమ్‌పై ఇడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. క్లబ్ కేంద్రంగా కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎఫ్‌క్లబ్ కేంద్రంగా టాలీవుడ్ తారలకు, కెల్విన్‌ల మధ్య జిఎం పాత్రపై విచారణ చేపట్టారు. ఈక్రమంలో క్లబ్‌కు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్‌ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజలు వచ్చేవారని, అయితే డ్రగ్స్ సరఫరా అంశం గురించి తనకు తెలియదని విక్రమ్ ఇడి అధికారులకు సమాధానం ఇచ్చినట్లు తెలియవచ్చింది. విచారణలో భాగంగా క్లబ్ జిఎం విక్రమ్‌కు డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులు కెల్విన్, వాహిద్‌లను ఎదురెదురుగా ఉంచి ఇడి ప్రశ్నించింది. అదేవిధంగా కెల్విన్ ముఠాకు, టాలీవుడ్ ప్రముఖులకు మధ్య జరిగిన నిధుల బదిలీపై ఇడి ప్రత్యేక దృష్టి సారించింది.

కెల్విన్ ఎవరో తెలియదు 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, రానా, నందు, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్,నవదీప్, ఎఫ్‌క్లబ్ జిఎం విక్రమ్‌లను ఇడి అధికారుల విచారణలో కెల్విన్ ఎవరో తమకు తెలియదని చెప్పినట్లు తెలియవచ్చింది. ఈనేపథ్యంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపడుతున్న ఇడి అధికారులకు కెల్విన్ ముఠాకు, టాలీవుడ్ ప్రముఖులకు మధ్య నగదు బదిలీ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నది సమాచారం. ఇప్పటి వరకు విచారణ హాజరైన వారు అసలు కెల్విన్ ఎవరో తమకు తెలియదనే సమాధానం చెబుతున్నారన్నది సమాచారం. దీంతో ఇడి అధికారులు సైతం విచారణకు హాజరయ్యే సెలబ్రెటీలను కెల్విన్‌ను ఎదురెదురుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయినప్పటికీ మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు లభ్యం కానట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News