ముంబై : మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాడులు చేపట్టింది. ఆదివారం ఉదయం 7.30 సమయంలో నాగ్‌పూర్ లోని కటోల్ ప్రాంతంలో దాడులు ప్రారంభమయ్యాయి. దేశ్‌ముఖ్ ఇంటిని ఈడీ, సిఆర్‌పిఎఫ్ స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులు అక్కడ లేరు. తన మంత్రి పదవిని దుర్వినియోగం చేసి బార్లు, రెస్టారెంట్లు నుంచి నెలకు రూ.100 కోట్ల వరకు వసూలుకు యత్నించినట్టు సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈనెల 16న దేశ్‌ముఖ్‌కు సంబంధించిన దాదాపు రూ.4 కోట్ల విలువైన ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. ఆయనపై నమోదైన కేసు విచారణకు హాజరు కావాలని ఈడి ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా దేశ్‌ముఖ్ స్పందించ లేదు. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయన ఆస్తులను ఈడి జప్తు చేసింది.
ED Raids 2 homes of ex-Maharashtra home minister