మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు..
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజస్థాన్ మంత్రికి షాక్
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో రాజస్థాన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెడ్ డైరీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి రాజేందర్ సింగ్ యాదవ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఈ తనిఖీలు జరుగుతున్నాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. రాజేందర్ సింగ్ యాదవ్ జైపూర్ లోని కోట్‌పుత్లీ నుంచి ఎమ్‌ఎల్‌ఎగా గెలుపొందారు.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేబినెట్‌లో నంబర్ టూగా కొనసాగుతున్నారు. ఆయన విద్య, న్యాయం వంటి పలు శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈడీతోపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సుమారు 10 ప్రాంతాల్లో సోదాల్లో పాల్గొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో యాదవ్ ఇంటి ముందు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి ఉన్నాయని, ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారని సమాచారం. అయితే తనిఖీలపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు.