మంత్రి బంధువులకు చెందిన ఏజెన్సీ
సహా 9 కంపెనీలకు ఇడి నోటీసులు
బిజెపి నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పిఎంఒ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇడి
మన తెలంగాణ/కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొన్ని గ్రానైట్ ఏజెన్సీలు రూ. 124 కోట్ల 94 లక్షల పైగా రూపాయల రాయల్టీ ఎగ్గొట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు బిజెపి నేతలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇడి అధికారులు మంత్రి బంధువులకు సంబంధించిన శ్వేత గ్రానైట్‌తో పాటు మరో 9గ్రానైట్ కంపెనీలకు నోటీసులిచ్చారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో శ్వేత ఏజెన్సీస్‌కి సైతం నోటీసులు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా గ్రానైట్ ఏజెన్సీలు రూ. 124, 94,46,147 కోట్ల మేరకు రాయల్టీ, దీనికి 5 రెట్ల ఫెనాల్టీ తో పాటు సినరేజీ ఫీజు కలుపుకొని మొ త్తం రూ.749 కోట్ల 66 లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను చెల్లించాలని బిజెపి నేతలు తగిన ఆధారాలతో ఈ ఏడాది మార్చి 27న ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
ఈ గ్రానైట్ కంపెనీల పన్ను ఎగవేత పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు గత నెల 8న ఇడికి, 10న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సి.బి.ఐ) లకు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. కాకినాడ, కృష్ణపట్నం సీపోర్టు ఎం.డి ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీస్, చెన్నై ద్వారా గ్రానైట్ బ్లాక్లు విదేశాలకు ఎగుమతి చేసిన ఈ 9 గ్రానైట్ కంపెనీలను పేర్కొంటూ అర్జంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదుల మేర కు శ్వేత ఏజెన్సీస్ తో పాటు 9 కంపెనీలు అయిన మీస్ షిప్పింగ్, జెఎం బ్యాక్సీ, మైథిలి ఆదిత్య, ట్రాన్స్‌పోర్ట్ కేవీఏ ఎనర్జీ ,అరవింద్ గ్రానైట్ ,శాండియా ఏజెన్సీస్, పీఎస్‌ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్ గ్రానైట్ కంపెనీలకు నోటీసులు అందా యి. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ కంపెనీలకు మంత్రి వెన్నుదన్ను ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
నోటీసులు అందుకున్న కంపెనీలు
గ్రైనేట్ ఎజెన్సీలలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్వేత ఏజెన్సీ, మీస్ షిప్పింగ్, జేఎం బ్యాక్సీ, మైథిలి ఆదిత్య, ట్రాన్స్పర్ట్ కేవీఏ ఎనర్జీ , అరవింద్ గ్రానైట్ ,శాండియా ఏజెన్సీస్, పీఎస్‌ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్‌లకు నోటీసులిచ్చారు.
పంజా విసురుతున్న ఈడీ
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన గ్రానైట్ కంపెనీలపై ఇడి కొరడా ఝలిపిస్తుంది. ఈక్రమంలో గ్రానైట్ కంపెనీల యాజమానుల్లో గుండెల్లో గుబుల్ రేగుతుంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మోతాదుకు మించి విదేశాలకు ఎగుమతి చేస్తుండడం తోపాటు సీనరేజీ చార్జీలు ఎగవేతపై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ కేంద్రానికి 2019 జూలైలో ఫిర్యాదు చేశారు. సీనరేజీ చార్జీలు రూ .749 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశారంటూ ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని పరిశీలించిన ఈడీ, ఫిర్యాదులో వచ్చిన ఆరోపణలపై విచారించే క్రమంలో కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్ పోర్టుల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మైనిం గ్ డిపార్ట్మెంట్‌లో చూపించిన వాటికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి పొంతన లేకుండా పోయింది. గతంలో వెళ్లిన ఫిర్యాదుల దృష్ట్యా సముద్ర మార్గంలో గ్రానైట్ ను రవాణా చేసే క్రమంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సీనరేజీ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసు నమోదు చేశారు . సీనరేజీ ఫీజును నాడు రూ .125 కోట్లుగా నిర్ణ యించారు. వాటిని చెల్లించకపోవడంతో దీనిపై ఐదు రెట్ల అపరాధ రుసుం విధిం చారు. దీంతో రూ.749 కోట్లకు పైగా గ్రానైట్ వ్యాపారులు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులిచ్చారు .
మంత్రి అబద్దాలకు చెక్: మహేందర్‌రెడ్డి
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పేరొందిన గ్రానైట్ ను వాటి ఏజెన్సీల యజమానులు అవినీతి, అక్రమాలకు పాల్పడి రూ.124 కోట్ల 94 లక్షల పైగా రూపాయల రాయల్టీ ఎగొట్టారని వాటి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదుదారుడు బిజెపి రాష్ట్ర నాయకులు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఫిర్యాదులో బేతి మహేందర్ రెడ్డి తెలుపుతూ మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్ తో పాటు 9 గ్రానైట్ కంపెనీలు రూ.124,94,46,147 కోట్ల రూపాయల రాయల్టీ, దీనికి 5 రేట్ల ఫెనాల్టీ తో పాటు సినరేజి ఫీ కలుపుకొని మొత్తం 749 కోట్ల 66 లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను చెల్లించాలని తగిన ఆధారాలతో 27 మార్చి 2021 రోజున ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగిందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.
ఈ గ్రానైట్ కంపెనీల పన్ను ఎగవేత పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తదుపరి జులై 8, 2021 రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) కి, జులై 10, 2021 రోజున సిబిఐలకు ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగిందని, వీటికి ముందు గతంలోనే ఇ.డి హైదరాబాద్‌లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని పిర్యాదుదారుడు బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. గానైట్ కంపెనీలకు పెద్ద దిక్కుఅని మీడియాలో చెప్పుకునే మంత్రి గంగుల కమలాకర్ చెప్పే పచ్చి అబద్దాలకు త్వరలో చెక్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయని పిర్యాదుదారుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.