Wednesday, January 22, 2025

తప్పు చేయలేదు..భయపడాల్సిన అవసరం లేదు: అరవింద్ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

దేవుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెంటే ఉన్నాడని, తాము ఎటువంటి తప్పు చేయని కారణంగా భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టం చేశారు. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆప్ రాజ్యసభ ఎంపి సంజీవ్ అరోరాకు చెందిన అనేక ప్రదేశాలపై ఇడి సోదాలు చేపట్టిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి సంబంధించిన దర్యాప్తు సాకుతో తన దర్యాప్తు సంస్థల ద్వారా ఆప్‌ను లక్షంగా చేసుకుని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇదివరకు తనతోపాటు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, ఇతరులను అరెస్టు చేసిందని ఆయన గుర్తు చేశారు.

ఇది అవినీతి దర్యాప్తులా కనపడడం లేదని, తన పార్టీని, పార్టీ నాయకులను అంతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తన వనరులను, దర్యాప్తు సంస్థలను పూర్తిగా వినియోగించుకుంటున్నట్లు కనపడుతోందని ఆయన ఆరోపించారు. కాగా, భూమికి సంబంధించిన మోసం కేసులో సంజీవ్ అరోరాకు చెందిన జలంధర్, లూధియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని అనేక ప్రాంగణాలలో ఇడి అధికారులు సోమవారం సోదాలు చేపట్టారు. లూధియానా(పంజాబ్), గురుగ్రామ్(హర్యానా)లోని 61 సంవత్సరాల రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరాకు చెందిన నివాసాలతోసహా 16-17 ప్రదేశాల ఇడి సోదాలు జరుపుతోందని ఇడి వర్గాలు తెలిపాయి. ఈ దాడులపై సోమవారం ముఖ్యమంత్రి ఆతిశీతో కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ నిజస్వరూపం క్రమంగా బయటపడుతోందని, ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్న విషయం ప్రజలకు బాగా అర్థమవుతోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News