Saturday, November 23, 2024

చత్తీస్‌గఢ్‌లో ఇడి దాడులు!

- Advertisement -
- Advertisement -

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ రూ. 508 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, తన పార్టీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆ సొమ్మును లంచంగా పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) చేసిన ఆరోపణ మామూలుగా అయితే అత్యంత తీవ్రమైనదే. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠను బలి తీసుకొనే శక్తి గలదే. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నాలుగు రోజుల్లో జరుగనుండగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇంకా నిరూపణ కావలసి వున్న ఇటువంటి భారీ ఆరోపణను ఎందుకు సంధించింది అనే ప్రశ్నకు అవకాశం కలుగుతున్నది. ఇడి ఈ ఆరోపణతో కోర్టుకు ఎక్కడంతోనే ప్రధాని నరేంద్ర మోడీ దానిని అందిపుచ్చుకొని చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచార వేదిక మీది నుంచి కాంగ్రెస్‌పై శివమెత్తినట్టు విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఆ రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు. అనేక కుంభకోణాలకు పాల్పడి కాంగ్రెస్ నాయకులు తమ ఇళ్ళ నిండా నోట్ల కట్టలను పేర్చుకున్నారన్నారు. చత్తీస్‌గఢ్‌లో బిజెపి ఆధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణాలన్నింటిపై పకడ్బందీ దర్యాప్తు జరిపించి దోపిడీ దొంగలందరినీ జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు.

మహాదేవ్ ఆల్‌లైన్ బెట్టింగ్ యాప్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి బఘేల్‌కి రూ. 508 కోట్లు అందాయన్నది ఈ కేసులో ప్రధాన అభియోగం కాగా, గురువారం నాడు భిలాయ్‌లోని ఒక హోటల్‌పై జరిపిన దాడుల్లో అసిమ్ దాస్ అనే నగదు కొరియర్ వద్ద రూ. 5.4 కోట్ల సొమ్ము పట్టుబడిందని, బఘేల్ అనే రాజకీయ నాయకుడికి అందజేయడానికి ఆ సొమ్మును మహదేవ్ యాప్ యజమానులు పంపించినట్టు అతడు చెప్పాడని ఇడి అంటున్నది. ముమ్మరమైన ఎన్నికల వేళ ఈ డబ్బు హోటల్‌లో పట్టుబడిందంటే ఎన్నికల కమిషన్ నిఘా ఏమైనట్టు? తగిన సాక్ష్యాధారాలతో ఈ కేసు న్యాయస్థానాల్లో నిరూపణ కావడానికి చాలా కాలం పడుతుంది. ఈలోగా ఇది ఈ కీలకమైన ఎన్నికల్లో బలమైన పావుగా ఉపయోగపడుతున్న విషయం కళ్ళముందున్నదే. ఇడి కేంద్ర ప్రభుత్వ సంస్థ, ప్రధాని మోడీ ఆ ప్రభుత్వానికి ఎదురులేని అధినేత. ఇప్పటికే ఇడి, సిబిఐ, ఐటి వంటి దర్యాప్తు సంస్థల ద్వారా కేవలం ప్రతిపక్ష పాలనలోని రాష్ట్రాల్లోనే లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఒక్క బిజెపి పాలిత రాష్ట్రంలోనైనా ఇంత వరకు మచ్చుకు ఒక్క దాడి కూడా ఈ సంస్థలు చేయలేదు.

అంటే ఆ రాష్ట్రాల్లో నీతి వెల్లువలాగా ఉప్పొంగిపోతోందని అనుకోవాలా? రాజకీయ అవినీతికి అక్కడ రవ్వంత చోటు కూడా లేదని భావించాలా? ఇటువంటి ప్రశ్నల వెలుగులో భూపేశ్ బఘేల్ మీద వచ్చిన ఈ ఆరోపణపై అనుమానాలు కలగడం సహజం. చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో డీలా పడిపోయి వుందని భావిస్తున్న బిజెపికి బలమైన టానిక్ ఇవ్వడం కోసమే ఈ ఉదంతానికి తెర లేచిందని ఎవరైనా భావిస్తే వారిని ఆక్షేపించవలసిన అవసరం కనిపించడం లేదు. భూపేశ్ బఘేల్‌ను ఉత్తమ ముఖ్యమంత్రిగా సిఓటర్ గవర్నెన్స్ ఇండెక్స్ నిగ్గు తేల్చింది. ఆయనను అక్కడి ప్రజలు అమితంగా అభిమానిస్తారని కూడా రూఢి అయింది. ఇప్పుడీ కుంభకోణం వార్త వారిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, ఈ ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో డిసెంబర్ 3న వెల్లడి అవుతుంది. ఇదే సమయంలో ఇడి రాజస్థాన్‌లో సాగిస్తున్న నిర్వాకాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. అక్కడ శుక్రవారం నాడు 25 చోట్ల ఇడి తాజా సోదాలు జరిపిందని వార్తలు చెబుతున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళల్లో కూడా ఈ మధ్య ఇడి దాడులు జరిపింది. ఆ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇలా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం ఇడిని, సిబిఐని, ఇతర దర్యాప్తు సంస్థలను వినియోగించడం ఇదే కొత్త కాదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అక్కడి కాంగ్రెస్ నేతల ఇళ్ళపై ఇడి దాడులు, సోదాలు జరిగాయి. గత మే నెల 10వ తేదీన కర్నాటక శాసన సభకు పోలింగ్ జరగ్గా, 3వ తేదీన ఆదాయపు పన్ను శాఖ అధికారులు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడి ఇంటిలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. కోటి స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడు కూడా ప్రధాని మోడీ కర్నాటకలో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లోనైతే ఇడి దాడులకు అంతే లేదు. అది ఆ రాష్ట్ర మంత్రులపై పని కట్టుకొని దాడులు చేసింది. ఆహార, అటవీ మంత్రుల ఇళ్ళల్లో సోదాలు జరిపింది. రాజకీయంగా ఎవరు తనకు కొరకరాని కొయ్యలుగా వున్నారో వారి మీద వీలైనన్ని మార్గాల్లో పగ సాధింపు చర్యలకు పాల్పడడం కేంద్రంలోని బిజెపి పాలకులకు అలవాటైపోయింది. అందుచేత తగిన ఆధారాలున్న కేసులేమైనా వున్నా వాటిని కూడా విశ్వసించలేని పరిస్థితి ఏర్పడింది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం వల్ల వాటి నిక్కచ్చితనం మీద నీలినీడలు పరుచుకొంటున్నాయి. దేశానికి చెప్పనలవికానంత హాని జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News