Saturday, November 16, 2024

మెడికల్ కాలేజీలను టార్గెట్ చేసిన ఇడి

- Advertisement -
- Advertisement -

మెడికల్ కాలేజీలను టార్గెట్ చేసిన ఇడి
రాష్ట్ర వ్యాప్తంగా 10 కళాశాలల్లో సోదాలు…
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లతో కోట్ల దందా
ఇడి సోదాల్లో గుట్టంతా బయటకు వస్తోందా..!?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది మెడికల్ కాలేజీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని పది ప్రైవేటు మెడికల్ కాలేజీలు నలభై ఐదు సీట్లు బ్లాక్ చేసి ఒక్కో సీటును కోట్లకు అమ్ముకు న్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ కాలేజీలపై ఇలాంటి ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఇడి ప్రస్తుతం సోదాలు ప్రారంభించడంతో మరోసారి చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో మొత్తం పది మెడికల్ కాలేజీల్లో ఇడి అధికా రులు ఒకే సారి బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వైద్య కళాశాలలు, వాటి యాజమాన్యాలపై ఇడి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పది మెడికల్ కాలేజీలపై ఇడి ఫోకస్ పెట్టింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.

కాలేజీలతోపాటు ఆ యజమాన్యాల నివాసాలు, ఆఫీస్‌లలో సోదాలు చేస్తోంది. బిఆర్‌ఎస్ నేత, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుం బానికి చెందిన మెడికల్ కాలేజీపై తనిఖీలు నిర్వహిస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, బిసిఎ మెడికల్ కాలేజీ, మెడిసిటీ మెడికల్ కాలేజీ, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ, ప్రతిమ, మమతా మెడికల్ కాలేజీ తదితరాలున్నాయి. కామినేని ఆస్పత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాలపై ఇడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఇళ్లలోనే కాకుండా కార్యా లయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో కూడా ఇడి అధికారుల సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలిస్తూ. మెడికల్ కళాశాలతోపాటు యాజమాన్యం ఆస్తులపై ఆరా తీస్తున్నారు. షామీర్ పేటలోని మెడిసిటీ కళాశాల ఏరియాలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

ఫిల్మ్ నగర్ లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై ఇడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలోనూ ఇడి సోదాలు నిర్వహిస్తోంది. ఈ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఇడి అనుమానిస్తోంది. అలాగే సీట్ల భర్తీలో భారీగా హావాలా లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం రెండు టీంలుగా విడిపోయి మరీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 చోట్ల ఇడి సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్ బాగ్ లోని ఇడి ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఇడి అధికారులు బుధవారం ఉదయం బయల్దేరారు. ఇడి బృందాలతోపాటు సిఆర్‌పిఎఫ్ బలగాలు కూడా వారి వెంట ఉన్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇడి దాడులు కొనసాగు తున్నాయి. ముంబైలో బిఎంసి కేంద్రంగా జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా ఇడి సోదాలు నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో హైదరాబాద్ హాస్పిటల్స్ నుండి ముంబై బిఎంసికు మెడికల్ కిట్స్ సప్లై అయిన క్రమంలో జరిగిన అక్రమాలు ఈ సోదాలకు కారణంగా తెలుస్తోంది.

సీట్లు బ్లాక్ చేసి కోట్లకు అమ్ముకున్నారా?
భారీగా నిధులు మళ్లింపు జరిగినట్టు ఇడి అభియోగంతో ఈ దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీల్లో భారీగా అవకతవకలు జరిగాయని మరి ముఖ్యంగా ఫీజుల వసూళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన సంస్థలు రూ.12వేల కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల కిందట ఐటి అధికారులు తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మెడికల్ సీట్ల కోసం అనధికారికంగా పెద్ద ఎత్తున నగదు తీసుకున్నారని, వాటిపై దర్యాప్తు చేయాలని ఇడికి ఐటిఅధికారులు లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకూ ఇడి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

సుదీర్ఘంగా సోదాలు చేసే అవకాశం..!
ఐటీ అధికారులు రాసిన లేఖల ఆధారంగా ఇడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారా? లేకపోతే. ముంబై బిఎంసి స్కామ్ ఆధారాంగా అనేది వెల్లడి కావాల్సి ఉంది. మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం కావడంతో సుదీర్ఘంగా సోదాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రకంపనలు సృష్టిస్తున్న దర్యాప్తు సంస్థల దాడులు..
రాష్ట్ర రాజకీయాల్లో దర్యాప్తు సంస్థల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పేరున్న రాజకీయ నాయకుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇడి, ఐటి పలు సంస్థలు సోదాలు నిర్వహించాయి. దీంతో తమ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి బిజెపి నేతలు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని.. వాటి పని అవి చేసుకుంటాయని వివరణ ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఈ దాడులు రానున్న ఎన్నికల్లో పలు మార్పులు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు టాక్ నడుస్తోంది.

ఆసక్తికరంగా మారిన దర్యాప్తు సంస్థల దాడులు..!
ఇదే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే బిఆర్‌ఎస్‌కు కు చెందిన ఇద్దరు ఎంఎల్‌ఎలతో పాటు ఓ ఎంపి ఇళ్లలో సోదాలు జరిగాయి. గతంలో కూడా బిఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలపై ఐటి సోదాలు సంచలనం సృష్టించింది. మంత్రి మల్లారెడ్డిపై సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలతో పాటు ఆయన కుమా రుడు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భారీగా నగదును స్వాధీనం చేసు కున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఫలింతగా ఆయన ఐటి విచారణకు హాజరయ్యారు. ఇక మరో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. ఎంపి వద్దిరాజు రవిచంద్ర కంపెనీల్లో కూడా ఈ సోదాలు జరగటమే కాదు, ఢిల్లీకి వెళ్లి విచారణకు హాజరయ్యారు. ఓ దశలో తమనే టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తున్నాయంటూ బిఆర్‌ఎస్ ఆరోపణలు గుప్పించింది. ఆందోళనలు కూడా చేపట్టింది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మోగనున్న నేపథ్యంలో ఈ ఐటి సోదాలతో పాటు మెడికల్ కాలేజీలపై ఇడి దాడులు జరగటం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News