న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారానికి సంబంధించి ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు నిర్వహించింది. ఢిల్లీ లోని విఠల్‌భాయ్ పటేల్ హౌస్ లోని సర్వేష్ మిశ్రా ఆవరణలో ఈడీ దాడులు నిర్వహించిందని సంజయ్ సింగ్ ట్వీట్‌లో ఆరోపించారు. ఆప్ నాయకుడు అజిత్ త్యాగి ప్రాంగణంలో ఈడీ దాడి చేసిందని చెప్పారు.
మోడీ, ఈడీ నియంతృత్వాన్ని, గుండాయిజాన్ని దేశం ముందు బయటపెట్టానని, ఈడీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంలో వ్యక్తుల ప్రమేయాన్ని మోసపూరితంగా రుజువు చేస్తోందని , తనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు సాధించలేక పోవడంతో తన సహాయకులపై దాడులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఈడీ పన్నిన ఎలాంటి కుట్రకు వ్యతిరేకంగా రాజీ పడబోనని, వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. దేశం ముందు అన్నిటినీ బయటపెడతామని, ఈడీ ఎలా దుర్వినియోగం అవుతోందో వెల్లడిస్తామన్నారు.
సుప్రీం కోర్టు, హైకోర్టు జోక్యం చేసుకున్నా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తాజా సమాచారం ప్రకారం మద్యం కుంభకోణంలో ఢిల్లీ లోని ఆరు చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అజిత్ త్యాగి, సర్వేష్ మిశ్రా, పునీత్ త్యాగి, అమిత్ గోయల్ నివాసాల్లో సోదాలు జరిగాయి. గుర్గావ్ లోని బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, వ్యాపారవేత్త దినేష్ అరోరా సిసోడియాకు సన్నిహిత సహచరులని, సీబీఐ తెలిపింది. ఇదిలా ఉండగా, లిక్కర్ పాలసీ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఈడీ డైరెక్టర్, మద్యం పాలసీ కేసుకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్, దర్యాప్తు అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరుతూ సంజయ్ సింగ్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కి లేఖ రాశారు. ఈ క్రమంలో దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.