Saturday, September 28, 2024

ఇది రాజకీయ కక్ష సాధింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు రాజకీయ కక్ష పూరితమైన చర్యలో భాగమేనని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీ లోపాయకారి ఒప్పందంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 నుంచి ఈడీ జరిపిన దాడుల్లో 97 శాతం పైగా ప్రతిపక్షాల మీద జరిగిన దాడులే నిదర్శమని, రాజకీయంగా లబ్ధి పొందడానికి అనవసర కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కక్ష్యపూరిత చర్యల్లో భాగంగానే కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తమ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. భయపెట్టడానికి ఈడీ, సిబిఐను బిజెపి వాడుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈడీ కేసుల్లో 2 శాతం కూడా నిరూపితం కాలేదు
రాజ్యాంగం మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, తాము రాజ్యాంగ బద్దంగానే తాము దీనిని ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని పిసిసి అధ్యక్షుడు భరోసా ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. పదేళ్ల ఈడీ దాడుల్లో 97 శాతం దాడులు ప్రతిపక్ష నాయకులపై జరిగినవేనని రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటివరకు నమోదైన ఈడీ కేసుల్లో 2 శాతం కూడా నిరూపితం కాలేదని ఆయన తెలిపారు. హైడ్రాలో నష్టపోతున్న పేదలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న బడాబాబులు, రియల్టర్ల దగ్గర నుంచి ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికే హైడ్రాను రంగంలోకి దింపామని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ చేసిన రుణమాఫీ సొమ్ము ఎంత? తొమ్మిది నెలల్లో తమ ప్రభుత్వం చేసిన రుణమాఫీ సొమ్ము ఎంత ? హరీష్ రావుకు చర్చకు సిద్ధమా..? అని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. ఇప్పటికే రూ.18 వేల కోట్లను రైతుల అకౌంట్‌లలో వేశామని, దీనికి హరీష్‌రావు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్‌రావు సచివాలయ ముట్టడి అంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని సరైన సమాధానం చెబుతామని ఆయన తెలిపారు.

ఈడీ దాడులు ముమ్మాటికీ కేంద్రంలోని బిజెపి కుట్రే: అద్దంకి దయాకర్
పొంగులేటి ఇంటిపై ఈడీ చేసిన దాడులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈడీ దాడులు ముమ్మాటికీ కేంద్రంలోని బిజెపి కుట్రేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులను బిజెపి భయపెట్టి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోందని అద్దంకి ఆరోపించారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న వారిని పొలిటికల్‌గా టార్గెట్ చేసుకొని అధికారం ఉంది కాదా అని కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. గతంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌పై ఇలాగే ఈడీ, ఐటీ దాడులు చేయించారని ఆయన గుర్తు చేశారు. అన్ని పర్యావసానాలకు బిజెపి భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News